పార్లమెంట్ లో కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు

పార్లమెంట్ లో కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్ల తీరు, ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌), యుజిసి నూతన మార్గదర్శకాలు, కొత్త విదేశాంగ విధానం తదితర అంశాలపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా అమలు చేస్తున్న విబి జి ఆర్‌ఎఎం జి చట్టం పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించడంపై చర్చించాలని, కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లపై, లక్షలాదిమంది ఓటర్లను మినహాయించిన ఎస్‌ఐఆర్‌పై సమీక్షించాలని కోరాయి.

అదేవిధంగా, అమెరికా నిరంకుశ జోక్యాలను ప్రశ్నించని బలహీనమైన విదేశాంగ విధానం, కేంద్రం కొనసాగించిన సమాఖ్య వ్యతిరేక విధాన విధానాలు, రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి, గవర్నర్ల అధికారాల దుర్వినియోగం, ఇయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై అమెరికా విధించిన 50 శాతం సుంకం వంటి అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి.

ఓటు చోరీ, ఎస్‌ఐఆర్‌, ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పునరుద్ధరణ, ఇతర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై చర్చించాలని డిఎంకె, వామపక్షాలు, టిఎంసి డిమాండ్‌ చేశాయి.  ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షకు సంబంధించి యుజిసిలో తెచ్చిన కొత్త నిబంధనలపై కూడా పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల అజెండాను ఇవ్వకపోవడంపై సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌, కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌ తదితరులు అభ్యంతరం తెలిపారు.అయితే, విబి జి ఆర్‌ఎఎం జి చట్టాన్ని వెనక్కి తీసుకోబోమని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై వివరణాత్మక చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసి పుచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎజెండాను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. 

ఉపాధి హామీ చట్టం విధ్వంసం, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అంశాలపై గత సెషన్‌లో చర్చించారనే కారణంతో ప్రతిపక్షం చేసిన ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, పార్లమెంట్‌ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, ఎల్‌ మురుగన్‌, జైరాం రమేష్‌ (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ (డిఎంకె), సాగరిక ఘోష్‌ (టిఎంసి), రాంగోపాల్‌ యాదవ్‌(ఎస్పీ), సిపిఎం ఎంపిలు అమ్రారామ్‌, జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు పాల్గొన్నారు.