అత్యంత కీలక ఇంధన మార్కెట్‌లలో భారత్‌ ఒకటి

అత్యంత కీలక ఇంధన మార్కెట్‌లలో భారత్‌ ఒకటి

ఇరుదేశాల మధ్య వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్‌-కెనడా దేశాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి.  ఇండియా ఎనర్జీ వీక్‌లో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చిన కెనడా ఇంధన మంత్రి టిమ్ హాడ్సన్ కెనడా భారతదేశానికి ఇంధనాన్ని సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని, తన దేశం ఎప్పటికీ ఇంధనాన్ని “బలవంతం చేయడానికి” ఉపయోగించదని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్‌లలో ఒకటిగా భారత్‌ అభివృద్ధి చెందుతోందని హడ్గ్‌సన్‌ వ్యాఖ్యానించారు. ఇంధన రంగంలో కెనడా సూపర్‌ పవర్‌ కావాలంటే భారత్‌తో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఎనర్జీ ట్రేడ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

“మనం జీవిస్తున్నది నిరంతరం మారుతున్న ప్రపంచం. ఆ మార్పుకు ఇంధనం కేంద్ర బిందువుగా ఉంది. మీలాగే, ఆ మార్పును ఎదుర్కోవడానికి బహుపాక్షిక సంబంధాలను నిర్మించడం, సరఫరాలో వైవిధ్యీకరణపై మరింత దృష్టి పెట్టడమే మార్గం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను,” అని కెనడా మంత్రి చెప్పారు.

రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై సుంకాలు విధించిన అమెరికాను ఉద్దేశిస్తూ, ‘బలమే హక్కు’ అనే అభిప్రాయాన్ని తమ దేశం వ్యతిరేకిస్తుందని కెనడా మంత్రి స్పష్టం చేశారు. అందుకు బదులుగా, కెనడా స్వేచ్ఛా వాణిజ్యాన్ని, విశ్వసనీయ సంబంధాలను విశ్వసిస్తుందని ఆయన చెప్పారు. ఇంధన అవసరాలను వైవిధ్యపరచడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

చమురు, గ్యాస్‌ వాణిజ్యాన్ని విస్తరించడం కోసం ఒట్టావా నుంచి భారత్‌కు ముడి చమురు, పెట్రోలియం, సహజ వాయువులను రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టిమ్ హడ్గ్‌సన్‌ తెలిపారు. కెనడా మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి మీడియాతో మాట్లాడారు.

ఇరుదేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ నిల్వ, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వాడకం వంటి విషయాలపై దృష్టిపెట్టామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో మన వాటా 30-35 శాతం పెరుగుతుందని, భారత్‌ మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.