బంగ్లాదేశ్ లో దొంగల దాడిలో 12 మంది జర్నలిస్టులకు గాయాలు

బంగ్లాదేశ్ లో దొంగల దాడిలో 12 మంది జర్నలిస్టులకు గాయాలు
బంగ్లాదేశ్ లోని నర్సింగ్డి ప్రాంతంలో బంగ్లాదేశ్ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన విరామ కార్యక్రమానికి హాజరై  బస్సులో ఢాకాకు తిరిగి వస్తుండగా దోపిడీదారులు, ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 12 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులు గాయపడ్డారు. ఢాకాకు చెందిన ప్రభుత్వ ప్రాయోజిత వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్బాద్ సంస్థ ప్రకారం, గాయపడిన వారిని నర్సింగ్డి సదర్ ఆసుపత్రికి తరలించారు.
 
మీడియా ప్రతినిధులతో కూడిన బస్సు రోడ్డు పక్కన ఆపి ఉంచినప్పుడు స్థానిక దోపిడీదారుల బృందం టోల్‌గా డబ్బు డిమాండ్ చేసింది. జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతో, వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారు స్థానికంగా తయారు చేసిన ఆయుధాలతో వారిపై దాడి చేశారు. పైగా, జర్నలిస్టుల వెంట ఉన్న వారి భార్యలు, పిల్లలను తగలవెడతామని బెదిరించారు. 
 
 గ్లోబల్ మీడియా భద్రత, హక్కుల సంస్థ ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ (పిఈసీ) ఈ దాడిని ఖండించింది. దాడికి గురైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరింది.
 
“గత కొన్ని వారాలుగా మీడియా వ్యక్తులపై జరుగుతున్న పలు దురాగతాలు ఎన్నికలకు ముందున్న బంగ్లాదేశ్ మీడియా ముఖ్యాంశాలలో ఉండటం చాలా దురదృష్టకరం. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డిలో, కొంతమంది అరాచక వ్యక్తుల దోపిడీ ప్రయత్నంపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. దాడులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు” అని పిఈసీ అధ్యక్షుడు బ్లేజ్ లెంపెన్ స్పష్టం చేశారు.
 
బంగ్లా పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని, మిగిలిన ముఠా కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని పిఈసీ దక్షిణాసియా ప్రతినిధి నవా ఠాకురియా తెలిపారు. జనవరి 5న జరిగిన జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి (45) హత్య ప్రపంచంలోనే ఈ ఏడాది జరిగిన తొలి హత్య అని ఆయన గుర్తు చేస్తూ, బంగ్లాదేశ్ లో జర్నలిస్టుల భద్రత పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.