ఘోర విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ దుర్మరణం

ఘోర విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అజిత్​ పవార్​తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం పుణెలోని బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కీలక ప్రజాసభలకు అజిత్ పవార్ హాజరుకావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆయన ముంబై నుంచి బారామతికి విమాన ప్రయాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం ముంబయి నుంచి బారామతికి వీఎస్​ఆర్​ సంస్థకు చెందిన లీర్​జెట్​-45 విమానంలో బయలుదేరారు. బారామతిలో ల్యాండ్​ అవుతుండగా 8:45 గంటల సమయంలో ఆయన విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానం పూర్తిగా కాలిపోయింది. 

సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. విమానంలో అజిత్​ పవార్​తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు క్రూ సభ్యులు ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరోవైపు బారామతి విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. విమానం ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. అయితే బుధవారం ఉదయం 8:45 గంటలకు బారామతిలోని  రన్‌వే థ్రెషోల్డ్ వద్ద క్రాష్ ల్యాండింగ్ జరిగిందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో అజిత్​ పవార్​తో సహా ఐదుగురు మృతి చెందినట్లు తెలిపింది.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

“బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా పలువురు మరణించడం చాలా బాధాకరం. అజిత్ పవార్ మరణం కోలుకోలేని నష్టం. మహారాష్ట్ర, సహకార రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యలు, మద్దతుదారులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడు కోరుకుంటున్నా” అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు.

అజిత్ పవార్ ప్రజల నాయకుడు, అట్టడుగు స్థాయి నుంచి బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ముందంజలో ఉండి కష్టపడి పనిచేస్తారు. పరిపాలనా విషయాలపై అవగాహన, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే మక్కువ ఎక్కువ. ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది, విచారకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.
అజిత్ పవార్‌కు భార్య సునేత్రా పవార్, ఇద్దరు కుమారులు పార్థ పవార్, జై పవార్ ఉన్నారు. ప్రస్తుతం సునేత్రా పవార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు పార్థ పవార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు.  మావల్ లోక్‌సభ సీటు నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. చిన్న కుమారుడు జై పవార్ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు. 2024 నుంచి ఈయన కూడా రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు.

అజిత్ పవార్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ సొదరుడి కుమారుడు. 2023లో ఎన్సీపీ రెండుగా చీలింది. అందులో ఒక వర్గానికి అజిత్ పవార్ ఆధ్వర్యంలో, మరో వర్గం శరద్ పవార్ నాయకత్వంలో కొనసాగుతోంది. ఆ తర్వాత అజిత్ పవార్ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ఇటీవల పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు కలిసి పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాయి. అజిత్ పవార్​- శరద్ పవార్ మళ్లీ కలిసిపోవడంపై ఎన్సీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు. ఆయితే ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అజిత్ పవార్ చనిపోవడంతో పార్టీ వర్గాలను కలిచివేస్తోంది.

అజిత్‌ పవార్‌ 1959 జులై 22న అహ్మదాబాద్‌ జిల్లా డియోలాలీ ప్రవరాలో జన్మించారు. డియోలాలీ ప్రవరాలోనే పాఠశాల విద్యాభ్యాసం జరిగింది. తండ్రి మరణంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు. 1982లో అజిత్‌ పవార్‌ రాజకీయ ప్రస్థానం మొదలైంది. చక్కెర ఫ్యాక్టరీ సహకార బోర్డు ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత పుణె జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఛైర్మన్‌గా విజయం సాధించారు. ఆ పదవిలో ఆయన సుదీర్ఘకాలంపాటు కొనసాగారు.

మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొందిన అజిత్‌ పవార్‌ 1991లో తన చిన్నాన్న శరద్‌ పవార్‌ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో శరద్‌ పవార్‌ బారామతి ఎంపీగా గెలుపొంది పీవీ నర్సింహారావు కేబినెట్‌లో రక్షణ మంత్రిగా సేవలందించారు. అజిత్‌ పవార్‌ బారామతి నుంచి ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం సేవలందించిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. 2022-23 మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రతిపక్ష నేతగా అజిత్‌ పవార్‌ కొనసాగారు.  అజిత్‌ పవార్‌ 2019 నవంబర్‌ 23న తిరుగుబాటు చేశారు. శరద్‌ పవార్‌ సారథ్యంలోని నేష్నలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. దేవేంద్ర ఫడణవీస్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌ పర్సనల్‌ సెక్యూరిటీ అధికారి విదీప్‌ జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్‌ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ప్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి చనిపోయారు.