అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు

మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టనుంది. ఘటనా స్థలాన్ని ఏఏఐబీ బృందం త్వరలోనే సందర్శిస్తుందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.  మరోవైపు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయడు కూడా ఘటనాస్థలికి పరిశీలించనున్నారు. అందుకోసం పౌర విమానయాన శాఖ, డీజీసీఏ ఉన్నతాధికారులతో కలిసి పుణెకు బయలుదేరారు. 

ఈ ఘటనపై విచారణ చేపడతామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్లైట్ రికార్డర్​, ఎన్​హాన్స్​డ్ గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్(ఈజీపీడబ్లయూఎస్), డిజిటల్ ఇంజిన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ (డిఈఈఎస్)లను స్వాధీనం చేసుకోనుంది. అలాగే ఎయిర్‌ఫ్రేమ్, ఇంజిన్ లాగ్‌బుక్స్, వర్క్ ఆర్డర్లు, ఆన్‌బోర్డ్ డాక్యుమెంట్లు, ప్రధాన తనిఖీ రికార్డులను ఆపరేటర్ నుంచి సేకరించి పరిశీలించనున్నారు. 

సిబ్బంది, విమానానికి సంబంధించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ పత్రాలను కూడా దర్యాప్తు బృందం కోరింది. అదనంగా, రాడార్ డేటా రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టేప్ రికార్డింగ్స్, హాట్‌లైన్ కమ్యూనికేషన్లను సేకరించి విశ్లేషించనున్నారు. సాక్షులు, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు.

ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. అజిత్‌ పవార్‌ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ విచారం వ్యక్తం చేశారు. ”వ్యక్తిగతంగా తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, నేను బారామతికి బయలుదేరాం. ప్రధాని మోదీతో మాట్లాడాను. ఈ నష్టంపై దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది” అని ఆయన చెప్పారు.

 
కాగా, ఇది కేవలం ప్రమాదం కాదని.. దీని వెనుక ఏదో కుట్ర జరిగి ఉండే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అజిత్ పవార్ బీజేపీ కూటమిని వీడాలని యోచిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించడం గమనార్హం.