*‘యుద్ధానికి స్వయంగా నిధులు సమకూర్చుకుంటున్నారు’
భారత్- యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అసహనం వ్యక్తంచేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ ఈయూపై ఆరోపణలు చేశారు. రష్యా ముడి చమురును రిఫైన్ చేసిన భారత ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ, తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారని విమర్శించారు.
“రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యన్ చమురు తొలుత భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని ఐరోపావాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు” అంటూ బెసెంట్ ధ్వజమెత్తారు.
మరోవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి తెరపడుతుందని ఆర్థిక మంత్రి బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. కానీ, ఆ త్యాగాలేంటో మాత్రం ఆయన వెల్లడించలేదు.
“మరోసారి స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు భారత్‌లోకి వెళ్తుంది, శుద్ధి చేసిన ఉత్పత్తులు బయటకు వస్తాయి, యూరోపియన్లు ఆ శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వారు తమకు తామే యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్నారు,” అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో, “మేము చివరికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తాము” అని ఆయన స్పష్టం చేశారు.

More Stories
బంగ్లాదేశ్ ఎన్నికల్లో 80 మంది హిందూ అభ్యర్థుల పోటీ
భారత్ పర్యటన తర్వాత యూఏఈ పాక్ తో కీలక ఒప్పందం రద్దు
అమెరికా సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు అరెస్ట్