యూఏఈ అధ్యక్షుడు భారత్ లో పర్యటనను ముగించుకుని వెళ్లిన వారం రోజుల్లోనే పాకిస్తాన్‌తో చేసుకున్న ఎయిర్‌పోర్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ వ్యవహారాలలో కలకలం రేపుతోంది. అందుకు భారత్‌తో యూఏఈ కుదుర్చుకున్న ఒప్పందమే కారణం అనే ప్రచారం జరుగుతోంది. గత వారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.
భారత్ లో ఆయన గడిపింది మూడు గంటలు మాత్రమే అయినా, ప్రధాని మోదీతో భేటీ జరగడం, ఈ సందర్భంగా తమ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయని రెండు దేశాలు ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో గతంలో పాకిస్తాన్‌తో యూఏఈ కుదుర్చుకున్న ఎయిర్‌పోర్ట్ ఒప్పందాన్ని ఆ దేశం రద్దు చేసుకుంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తామని పాకిస్తాన్‌తో యూఏఈ గత ఏడాది ఆగష్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
కానీ, తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ సరైన నిర్వహణ భాగస్వామిని చూపించకపోవడం వల్లనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. కానీ, దీని వెనుక అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉన్న వివాదం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
పాకిస్తాన్ సౌదీతోపాటు మరికొన్ని దేశాలను కలుపుకొని ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా ఉంది కాబట్టి ఇందులో ఆ దేశ ప్రత్యర్థి అయిన యూఏఈ ఉండబోదు. అందుకే దీనికి పోటీగా యూఏఈ భారత్, ఇజ్రాయెల్‌లతో కలిసి కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.
తాజాగా ఈ అంశంపై చర్చ జరిగినందునే పాకిస్తాన్‌కు యూఏఈ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ కు మరింత దగ్గరయ్యేందుకు యూఏఈ. పాక్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 900 మంది భారత ఖైదీలను విడుదల చేసేందుకు కూడా యూఏఈ అంగీకారం తెలిపింది.

More Stories
బంగ్లాదేశ్ ఎన్నికల్లో 80 మంది హిందూ అభ్యర్థుల పోటీ
అమెరికా సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు అరెస్ట్
బంగ్లాదేశ్‌ను వదిలిన 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు