దక్షిణ కొరియాపై ట్రంప్ సుంకాలు 25 శాతానికి పెంపు

దక్షిణ కొరియాపై ట్రంప్ సుంకాలు 25 శాతానికి పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది ఆమోదించిన వాణిజ్య ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు.

“వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు చాలా ముఖ్యమైనవి. ప్రతి ఒప్పందంలోనూ, అంగీకరించిన లావాదేవీ ప్రకారం మేం వేగంగా టారిఫ్‌లు తగ్గించాం. అదే విధంగా మా వాణిజ్య భాగస్వాములు కూడా వ్యవహరిస్తారని మేము ఆశిస్తున్నాం. దక్షిణ కొరియా పార్లమెంట్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండటం లేదు” అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

“గతేడాది జులై 30 ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒక గొప్ప ఒప్పందాన్ని నేను, అధ్యక్షుడు లీ కుదుర్చుకున్నాం. అక్టోబర్ 29న నేను కొరియాలో ఉన్నప్పుడు దీని గురించి పునరుద్ఘాటించాం. కానీ పార్లమెంట్ దీనిని ఎందుకు ఆమోదించలేదు? ఇది వారి విచక్షణకు సంబంధించిన విషయం. అయినప్పటికీ నేను ఆటోలు, కలప, ఫార్మా సహా అన్ని ఇతర వస్తువులపై సుంకాలను 15 నుంచి 25 శాతాని పెంచుతున్నా” అని ట్రంప్ పోస్ట్లో రాసుకొచ్చారు.

అమెరికాలో దక్షిణ కొరియా 350 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని, వాటిలో అమెరికన్ షిప్‌యార్డుల పునరుద్ధరణ కూడా ఉందని ఒప్పందం సమయంలో ట్రంప్ చెప్పారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్తో చర్చలు జరిపేందుకు త్వరలో తమ వాణిజ్య మంత్రి కిమ్ జంగ్-క్వాన్ యూఎస్కు వెళ్తున్నట్లు తెలిపింది. అలాగే ట్రంప్ సుంకాల ప్రకటనపై చర్చించడానికి అధ్యక్షుడి విధానాల కార్యదర్శి కిమ్ యోంగ్ బియోమ్ ఒక సమావేశం నిర్వహిస్తారని వెల్లడించింది.

అమెరికా వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం, దక్షిణ కొరియా అగ్రరాజ్యానికి ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. 2024లో దక్షిణ కొరియా నుంచి అమెరికాకు 132 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి అయ్యాయి. అందులో ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. పెరగిన సుంకాల కారణంగా ఈ రంగాల ఉత్పత్తులు అధిక ధరలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

అయితే ఈ పెరిగిన టారిఫ్‌లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కెనడాపై 100శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై ముందుకెళ్తే వారిపై చర్యలు తప్పవని అన్నారు. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. అయితే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చర్చల అనంతరం సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు.