ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాల గురించి తెలంగాణ ప్రభుత్వం, ఆయన కార్యాలయం అంతా గుంభనంగా వ్యవహరిస్తున్నది. ఆయన పర్యటన వివరాలను బహిర్గతం చేయడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది.
అప్పటి నుంచి ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మూడు రోజుల తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నట్టు సోమవారం పత్రికా ప్రకటన, ఫొటోలు విడుదల చేశారు. అంతకు ముందు, సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లినట్టుగానీ, పలానా చోట దిగినట్టుగానీ, సీఎంవో నుంచిగానీ, ప్రభుత్వం నుంచిగానీ ఒక్క ఫొటో బయటకు రాలేదు. 22 నుంచి 26వ తేదీ సాయంత్రం వరకు ఆయన పర్యటనలకు సంబంధించి ఒక్క విషయం కూడా తెలియలేదు.
రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్(దావోస్) పర్యటనకు వెళ్లినప్పుడు జ్యూరిచ్ విమానాశ్రమంలో అక్కడ ఉండే తెలంగాణవాసులు స్వాగతం పలికారు. ఈ మేరకు సీఎంవో ఫొటోలు సహా ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మరి 22 తర్వాత అమెరికాకు వెళ్లిన సీఎంకు అక్కడి తెలంగాణ ప్రవాసులు ఆహ్వానం పలుకలేదా? అనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పలికితే సీఎంవో నుంచి ఎందుకు ఫొటోలు, ప్రెస్‌నోట్లు ఇవ్వలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ తెలుగువారు స్వాగతం పలికారు. ప్రెస్‌నోట్లు, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులతో హడావుడి చేశారు. కానీ ఈ పర్యాయం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై గోప్యత పాటిస్తూ ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. దీంతో అసలేం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుగు రోజుల తర్వాత సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫొటోను సీఎంవో విడుదల చేసింది. అక్కడ తరగతులకు హాజరైనట్టు తెలిపింది.

More Stories
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మానస’కు సిఎస్ఆర్ సహాయం
ప్రతి బొగ్గు గని కార్మికుడి ప్రాణం విలువైనదే!
అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా, సుపరిపాలన కోసమే జెన్ -జెడ్