ఇండియా-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఆతరహా ఒప్పందం చేసుకున్న మూడో ఆసియా దేశంగా భారత్ నిలిచింది. యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లూయిస్‌తో కలిసి ఉమ్మడిగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ -ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సాయపడుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఇది భారత్- ఐరోపా ప్రజలకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్దతను మరింత బలోపేతం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీలో ఇండియా-ఈయూ వ్యాపార భాగస్వామ్య వాటా 25 శాతం ఉందని చెప్పారు.
ప్రస్తుతం భారత్- ఈయూ మధ్య వాణిజ్యం 180 బిలియన్ యూరోల స్థాయికి చేరిందని వెల్లడించారు. ఎనిమిది లక్షల మందికి పైగా భారతీయులు ఈయూ దేశాల్లో నివసిస్తూ అక్కడి సమాజాలకు సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చొరవ చూపారని తెలిపారు. ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ ఒప్పందం భారత్- ఐరోపా దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొంటూ ఐరోపా, భారత బంధం ఈనాటిది కాదని, తమ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారు ఉన్నారని చెప్పారు.
ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశానికి ఎగుమతి అయ్యే 90% కంటే ఎక్కువ యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబడతాయి లేదా పూర్తిగా తొలగించబడతాయి.దీనివల్ల యూరోపియన్ ఎగుమతిదారులకు ఏటా సుమారు €4 బిలియన్ల మేర ఆదా అవుతుందని అంచనా. ఈ ప్రత్యక్ష ప్రయోజనం తక్కువ ధరలు, మెరుగైన ముడిసరుకు వ్యయాల రూపంలో భారతీయ వినియోగదారులకు, దేశీయ పరిశ్రమలకు లభించే అవకాశం ఉంది.
ఇండియా-ఈయూ మధ్య 1962 నుంచి నుంచి వ్యాపార, వాణిజ్య ఒప్పందం కొనసాగింది. ఇది 2004 నుంచి వ్యూహాత్మకంగా మారింది. ఈ రెండు దశాబ్దాలలో ఎదురైన అనేక అవరోధాలకు తాజా ఒప్పందం చెక్ పెట్టబోతుంది. ఇప్పుడు కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయంగా కీలకంగా మారనుంది. ట్రంప్ టారిఫ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లను గందరగోళంలో నెట్టేశాయి. ఈ సమయంలో ఇండియా-ఈయూ ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్యానికి సానుకూల సంకేతాల్ని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇండియాకు ఈయూ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈయూ-ఇండియా మధ్య 2024-25 మధ్య 136 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం జరిగింది. భారత తయారీ, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ వంటి రంగాల్లో ఈయూ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు భారత ఐటీ కంపెనీలు, ఫార్మా వంటి సంస్థలు యూరప్‌లో సేవలందిస్తున్నాయి.
More Stories
కీలక జనరల్స్ తొలగింపుతో గందరగోళంలో చైనా సైన్యం
దక్షిణ కొరియాపై ట్రంప్ సుంకాలు 25 శాతానికి పెంపు
భారత్ వైమానిక శక్తికి తాళలేకే పాక్ కాల్పుల విరమణ