అమెరికాకు వెళ్లాలి అనుకొనే కొంత మందికి చట్టబద్ధమైన మార్గాల్లో అమెరికా వీసా దొరక్కపోతే అక్రమ మార్గాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇందుకోసం దళారులను ఆశ్రయించి, వారికి భారీగా డబ్బులు చెల్లిస్తే సరిహద్దుల నుంచి అమెరికాలోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఇలా అక్రమ మార్గాల్లో వెళ్లడం నేరం కావడంతో సరిహద్దుల్లో అమెరికా భద్రతా బలగాలు వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2025లో ప్రతీ 20 నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికా సరిహద్దుల్లో పట్టుబడుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, సరిహద్దుల వద్ద నిఘా పెంచినప్పటికీ అక్రమ వలసల ప్రయత్నాలు మాత్రం తగ్గడం లేదు.
2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 23,830 మంది భారతీయులను అమెరికా సరిహద్దు భద్రతా దళాలు (సీబీపీ) అదుపులోకి తీసుకున్నాయి. అయితే అంతకుముందుతో పోల్చితే గతేడాది ఈ అక్రమ వలసల అరెస్ట్‌లు తగ్గడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. 2024లో అక్రమ మార్గాల్లో అమెరికాలోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య 85,119గా ఉండగా, ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యల వల్ల 2025లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఇప్పటికీ అత్యధికంగా అక్రమ వలసలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ మొదటి వరుసలో ఉండటం గమనార్హం. అమెరికా సరిహద్దుల్లో పట్టుబడిన వారిలో అధిక శాతం ఉపాధి కోసం వెళ్తున్న యువకులు ఉన్నారు. ఏ విధమైన తోడు లేకుండా ఒంటరిగా సరిహద్దులు దాటుతున్న భారతీయ చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
2022లో గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబం కెనడా సరిహద్దులో మంచులో గడ్డకట్టి మరణించిన ఘటన తర్వాత కూడా మెక్సికో, కెనడా మార్గాల ద్వారా ప్రాణాలకు తెగించి అమెరికాలోకి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. మెక్సికో సరిహద్దులో నిఘా పెరగడంతో వలసదారులు ఇప్పుడు కెనడా-అమెరికా సరిహద్దును ఎంచుకుంటున్నారు. దుబాయ్, ఇస్తాంబుల్ వంటి నగరాలను హబ్‌లుగా వాడుకుంటూ కొత్త మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం డిపోర్టేషన్ (బహిష్కరణ) ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ.. గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ప్రజలు మెరుగైన జీవితం కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఇది అణచివేత మాత్రమే, అక్రమ వలసల నిర్మూలన కాదని వలసల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More Stories
భారత్- ఈయూ ఒప్పందం వేళ అమెరికా అక్కసు
బంగ్లాదేశ్ ఎన్నికల్లో 80 మంది హిందూ అభ్యర్థుల పోటీ
భారత్ పర్యటన తర్వాత యూఏఈ పాక్ తో కీలక ఒప్పందం రద్దు