జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’

జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’

* స్ఫూర్తిదాయకంగా కీరవాణి ‘వందే మాతరం’

దేశ స్వాతంత్ర్య పోరాటంలో అగ్నిజ్వాలలా రగిలిన ‘వందేమాతరం’ నినాదానికి త్వరలో సరికొత్త రాజ్యాంగ గౌరవం దక్కబోతోంది. జాతీయ గీతమైన ‘జనగణమన’కు ప్రస్తుతం అమలు అవుతున్న ప్రోటోకాల్స్‌ను జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ గేయం రాసి 150 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దీనికి సముచిత గౌరవం కల్పించేలా కేంద్ర హోం శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోంది.

ప్రస్తుతం ‘నేషనల్ హానర్ యాక్ట్ 1971’, రాజ్యాంగంలోని అధికరణ 51(ఏ) ప్రకారం ప్రతి పౌరుడు జాతీయ గీతాన్ని గౌరవించడం విధి. జనగణమన పాడుతున్నప్పుడు నిలబడటం తప్పనిసరి. ఎవరైనా జాతీయ గీతానికి అగౌరవం కలిగిస్తే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే జాతీయ గేయమైన వందేమాతరం విషయంలో ఇప్పటి వరకు ఇలాంటి కఠినమైన నిబంధనలు లేవు. 

 
దీనిపై గతంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అనప్పటికీ ప్రభుత్వం దీనికి ప్రత్యేక ప్రోటోకాల్ లేదని అప్పట్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనందమఠం’ నవలలోని ఈ గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారులకు వెన్నుముకగా నిలిచింది. 
 
1950లో దీనిని జాతీయ గేయంగా ఆమోదించినప్పటికీ దీని చుట్టూ రాజకీయ వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. అసలు గేయంలో ఆరు చరణాలు ఉండగా, ప్రస్తుతం కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా వాడుతున్నారు. మిగిలిన చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉందనే కారణంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించిందని బీజేపీ ఆరోపిస్తోంది.
 
గత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ జాతీయ జెండా, జాతీయ గీతంతో పాటు జాతీయ గేయానికి కూడా సమానమైన హోదా ఉండాలని నొక్కి చెప్పారు. జాతీయ గేయం పాడేటప్పుడు అనుసరించాల్సిన సమయం, క్రమశిక్షణపై స్పష్టమైన మార్గదర్శకాలను హోం శాఖ రూపొందిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

కాగా, ఆస్కార్‌ విజేత ఎంఎం కీరవాణి సరికొత్తగా రూపొందించిన ‘వందే మాతరం’ గేయం గణతంత్ర దినోత్సవాల్లో మారుమోగింది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సోమవారం జరిగిన కవాతులో ఆయన నేతృత్వంలో దాదాపు 2,500 మంది కళాకారులు ఈ గేయాన్ని ఆలపించారు. ఈ ‘వందే మాతరం’ గేయం ఆహూతుల్లో భావోద్వేగాన్ని నింపింది. విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఈ ప్రదర్శన జరిగింది. గణతంత్ర దినోత్సవ కవాతుకు సంగీతం సమకూర్చడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కీరవాణి ఎక్స్‌ వేదికగా చెప్పారు.