77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, మోహన్ నగర్, కొత్తపేట లోని `మానస’ చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థకు ప్రత్యేక విద్య, థెరపీ సేవల కోసం డీపెన్ ఏఐ అనుబంధ సంస్థ ఆర్క్‌సైన్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి రూ.7 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత విరాళం అందింది. ఈ విరాళంను మేధస్సు లోపాలు, ఇతర వైకల్యాలు కలిగిన పిల్లల అభివృద్ధికై సమకూర్చారు.
దాత సంస్థ తరఫున విరాళాన్ని అందజేసిన సహ-సంస్థాపకుడు, డైరెక్టర్, డీపెన్ ఏఐ అనిల్ ముత్తినేని మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థగా, సమాజంతో అనుబంధాన్ని కొనసాగించే మానస వంటి సంస్థలకు సహకారం అందించటం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మానవత్వానికి అసలైన అర్థం పరస్పరం ఒకరిని మరొకరు ఆదుకోవడంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐదువేల సంవత్సరాల పురాతన నాగరికత ఒక లిఖిత రాజ్యాంగంతో ఆధునిక యుగంలోకి అడుగుపెట్టిన రోజుగా ఈ దినం నిలిచిందని, సార్వత్రిక ఓటు హక్కుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని స్థాపించి, సమానావకాశాలు, భావ ప్రకటన స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులను ప్రతి పౌరుడికి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. దివ్యాంగుల సంక్షేమానికి తోడ్పడటం ద్వారా సానుభూతి, అవగాహనతో కూడిన బలమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.
మానస మేనేజింగ్ కమిటీ సభ్యుడు టి. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అత్యంత అవసర సమయంలో ఈ ఆర్ధిక చేయూత అందడం ఎంతో ఉపశమనం కలిగించిందని, ప్రత్యేక పిల్లలకు అవసరమైన నాణ్యమైన పునరావాస సేవలను నిరంతరంగా అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని కృతఙ్ఞతలు తెలియజేసారు.
మానసలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో యెల్లయ్య బట్టు, ప్రోగ్రామ్ మేనేజర్, డీపెన్ ఏఐ ఇండియా; టి. మల్లికార్జున గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీల హోమ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్; డా. ఎన్. కళ్యాణ్ చక్రవర్తి, ఆర్‌ఎమ్‌ఓ, గాంధీ ఆసుపత్రి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. దీపెన్ ఏఐ ఇండియా ప్రతినిధులు ప్రత్యేక పిల్లలతో కలిసి మొక్కలు నాటారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మానస జీవిత సభ్యులు కామేశ్వర రావు, పి. సదానంద్, ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జి. విజయ భాను, క్లినికల్ కోఆర్డినేటర్ బి. అనిత, థెరపిస్టులు, బోధనా సిబ్బంది, ప్రత్యేక పిల్లల తల్లిదండ్రులు, స్వచ్ఛంద కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

More Stories
ప్రతి బొగ్గు గని కార్మికుడి ప్రాణం విలువైనదే!
అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా, సుపరిపాలన కోసమే జెన్ -జెడ్
ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలు