ఉత్తరాఖండ్ లోని శతాబ్దాల క్రితం నాటి ప్రాచీన హిందూ ఆలయాలలో హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారు. శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లోకి ఇకపై హిందూయేతరులను అనుమతించరు. ఈ ఆంక్ష శతాబ్దాల నాటి బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల నుండి మా గంగా శీతాకాల నివాసమైన ముఖ్బా వరకు విస్తరిస్తుందని కమిటీ తెలిపింది.
శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ సెమ్వాల్, ధామ్, ముఖ్బాలోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని ధృవీకరించారు. ఇదిలా ఉండగా, బీజేపీ నాయకుడు, శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) చైర్మన్ హేమంత్ ద్వివేది, బద్రీనాథ్, కేదార్‌నాథ్ లతో సహా తమ కమిటీ పరిధిలోని అన్ని దేవాలయాలలోకి హిందూయేతరులను నిషేధించే ప్రతిపాదనను కమిటీ తదుపరి బోర్డు సమావేశంలో ప్రవేశపెడతామని ప్రకటించారు.
ఈ కమిటీ మొత్తం 45 దేవాలయాలను నిర్వహిస్తుంది. వాటిల్లో శ్రీ తుంగనాథ్ ఆలయం, బద్రీనాథ్‌లోని మాతా మూర్తి ఆలయం, జోషిమఠ్‌లోని నరసింగ్ ఆలయం, శ్రీ మద్మహేశ్వర్ ఆలయం, ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం ఉన్నాయి. ఉత్తరాఖండ్ మత, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని ద్వివేది నొక్కి చెప్పారు.
“చారిత్రాత్మకంగా, కేదార్‌నాథ్, మానా ప్రాంతాలలోని దేవాలయాలలోకి ప్రవేశం హిందువులకు మాత్రమే పరిమితం చేయబడింది. బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో, ఈ సంప్రదాయాలను తరచుగా విస్మరించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పాటించేలా చర్యలు తీసుకుంటాము,” అని ఆయన తెలిపారు.
చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయం ఆరు నెలల శీతాకాలపు మూసివేత తర్వాత ఏప్రిల్ 23న భక్తుల కోసం తిరిగి తెరుస్తారు. వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్‌లోని తెహ్రీ రాజభవనంలో సాంప్రదాయ ఆచారాల తర్వాత తేదీ, ముహూర్తం ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తరకాశీలోని గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలు అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19న తిరిగి తెరుస్తారు. అయితే రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ ప్రారంభ తేదీ మహాశివరాత్రి నాడు ప్రకటిస్తారు.

More Stories
గణతంత్ర వేడుకల సమయంలో జవాన్లపై మావోయిస్టుల దాడి
రిపబ్లిక్ డే వేళ 10,000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు