బిజెపిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలని టిడిపి ఎంపీలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేశారు. ఈ నెల 28 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన నివాసంలో జరిగిన టిడిపి ఎంపీల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో గానీ, క్షేత్రస్థాయిలో కానీ కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హితవు చెప్పారు.
ప్రతిపక్షాలు బిజెపిపైనా, కూటమిపైనా విమర్శలు చేస్తే వెంటనే స్పందించాలని, దీటుగా తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రాభివృధ్ధిలో ఎంపిల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, రాష్ట్రానికి ఏం సాధించవచ్చేనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ఆయన కోరారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయం పథకం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యత అంశాలుగా తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రరాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టనున్నారని, దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులకు దగ్గరగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆర్అండ్ఆర్ పూర్తి చేయాలని, దీనికి సంబంధించి రూ.12వేల కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలని చెప్పారు.
2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేయగలిగితే బావుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన జలవనరుల ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదని స్పష్టం చేశారు . నల్లమల సాగర్ వంటి అంశాలు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే రాష్ట్రవాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదనే అంశాన్ని వివరించాలని తెలిపారు. పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలే ప్రణాళికలు రూపొందించామని వివరించారు.
ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ వేసేలా చూడాలని చెప్పారు. రైల్వేశాఖలో ఎక్కువగా నిధులు ఉంటాయని, నియోజకవర్గాల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఎన్డిఎ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తావించాలని సూచించారు. సభలో ఎంపిలందరూ మాట్లాడాలని, సమస్యలు ఉత్పన్నమైనా పట్టు వదలకుండా ప్రయత్నించాలని చెప్పారు.
రాష్ట్ర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపిలందరూ వర్చువల్గా పాల్గనాలని స్పష్టం చేశారు. ఈసారి టీడీపీపీ భేటీకి జనసేన, బీజేపీ ఎంపీలను కూడా పిలుద్దామని.. దీనివల్ల మనవాణికి బలం చేకూరుతుందని తెలిపారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు,ఎంపిలు పాల్గొన్నారు.

More Stories
సింహాచలంలో అత్యంత వైభవంగా రథసప్తమి మహోత్సవాలు
కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్ తో చంద్రబాబు భేటీ
కాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయం ఏకాత్మతా మానవతావాదం