సింహాచలంలో అత్యంత వైభవంగా రథసప్తమి మహోత్సవాలు

సింహాచలంలో అత్యంత వైభవంగా రథసప్తమి మహోత్సవాలు

కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న సింహగిరి పుణ్యక్షేత్రంలో సూర్యనారాయణ భగవానుని ఆరాధనకు ప్రతీకగా జరుపుకునే పవిత్ర రథసప్తమి మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి.  ఆలయ ఈవో శ్రీమతి ఎన్. సుజాత పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య దేవస్థానమంతా ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.
కొండ దిగువన ఉన్న కృష్ణాపురం గోశాల వద్ద తెల్లవారుజామున 05.30 గంటల నుంచే సూర్యనారాయణ స్వామివారి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శన భాగ్యం పొందారు. గోశాల ప్రాంగణం అంతా నామస్మరణలతో మారుమోగింది.ప్రధాన ఆలయంలో ఉదయాన్నే నిత్యారాధనలు అనంతరం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాకారంలోని ప్రాచీన “రాతి రథం” పై వేంచేయించారు.
స్థానాచార్యులు  రాజగోపాల్ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాతి రథంపైనే విశేష అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం 10 గంటలకు రథంపైనే స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీమతి ఎన్. సుజాత మాట్లాడుతూ  రథసప్తమి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని ముందుగానే అంచనా వేసి, దేవస్థానం తరఫున విస్తృత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.  భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో, గోశాల వద్ద, దర్శన మార్గాల్లో మంచినీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, నీడ ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, క్యూలైన్ నిర్వహణను పటిష్టంగా అమలు చేశారు.
భక్తులకు పులిహోర, లడ్డు ప్రసాదాలు సకాలంలో అందే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, పంపిణీలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈ మహోత్సవాల్లో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బం,  వేలాదిమంది భక్తులు పాల్గొని ఉత్సవాన్ని జయప్రదం చేశారు. సాయంత్రం  5 గంటలకు శ్రీ స్వామివారు సూర్యప్రభ వాహనం పై తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.