బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ
అమెరికా దాడి చేస్తుందనే భయాలు ఇరాన్ ను చుట్టుముట్టాయి. దాంతో దేశాధినేతల రక్షణ కోసం అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు టెహ్రాన్‌ లోని సురక్షితమైన బంకర్‌కు తరలించినట్లు సమాచారం.  అమెరికా దాడిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సీనియర్‌ మిలిటరీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బంకర్‌లో ఖమేనీ ఆశ్రయం పొందుతున్నారు. 
 
దీన్ని టెహ్రాన్‌లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్‌ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలపై ఇరాన్‌ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. 
 
ఇరాన్‌లో పరిపాలనకు వ్యతిరేకంగా పెద్దఎత్తన నిరసనలు చలరేగాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులకు హాని కలిగితే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. ఆ దేశంపై సైనికచర్యకు కూడా సిద్ధమవగా చివరి నిమిషంలో నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. అయితే, ఇటీవల భారీ సంఖ్యలో తమ యుద్ధ నౌకలు ఇరాన్‌వైపు కదులుతున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం ఇరాన్‌లో భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి.