భారత్ విజయం ప్రపంచాన్ని స్థిరంగా మారుస్తుంది

భారత్ విజయం ప్రపంచాన్ని స్థిరంగా మారుస్తుంది

భారత్ విజయం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా ఉంచుతుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయెన్ వ్యాఖ్యానించారు. డిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉర్సులా వాన్ డర్ లేయెన్‌తో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో గౌరవకరమైన క్షణమని ఉర్సులా తెలిపారు. ” భారత్ విజయం ప్రపంచాన్ని మరింత స్థిరంగా మారుస్తుంది. దాని ఫలితాలు మనందరికీ లాభమే” అంటూ ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఉర్సులా వాన్ డర్ లేయెన్, ఆంటోనియో కోస్టా కలిసి శిఖరాగ్ర స్థాయి చర్చలు జరపనున్నారు. 

ఈ భేటీలో భారత్ ఈయూ మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ లభించనుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన ఉర్సులా, భారత్- ఈయూ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్​గా కొందరు అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ ఒప్పందం ద్వారా రెండు బిలియన్ల జనాభా కలిగిన భారీ మార్కెట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటా కలిగి ఉంటుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడమే యూరప్ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు డిల్లీకి వచ్చే ముందు కూడా భారత్​పై ప్రశంసలు కురపించారు ఉర్సులా. భారత్ వేగంగా ఎదుగుతున్న దేశంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని ఆమె పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం, అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాల విషయంలో భారత్ చూపుతున్న నాయకత్వం ప్రశంసనీయం అని తెలిపారు. ప్రపంచ స్థిరత్వానికి భారత్ శక్తిమంతమైన భాగస్వామిగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇరు పక్షాల మధ్య సరుకుల వాణిజ్యం 135 బిలియన్ డాలర్లకు చేరింది.

2007లో ప్రారంభమైన ఈ ఒప్పంద చర్చలు 2013లో నిలిచిపోయాయి. అనంతరం 2022లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసే కార్లపై భారత్ భారీగా సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.

మొదటి దశలో 15 వేల యూరోలకుపైగా ధర ఉన్న పరిమిత సంఖ్యలో కార్లపై పన్ను తగ్గింపులు అమలు చేయనున్నారు. క్రమంగా వీటిని 10 శాతం వరకు తగ్గించే యోచన ఉంది. ఈ మార్పులతో వోక్స్‌వాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ కార్ల కంపెనీలకు భారత్ మార్కెట్ మరింత సులభమవుతుంది. ఆటోమొబైల్ రంగంతో పాటు ఐటీ, ఫార్మా, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. 

ఒప్పందం కుదిరితే భారత్–ఈయూ మధ్య వ్యాపారం మాత్రమే కాదు, రాజకీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా మరింత బలోపేతం కానున్నాయి. గ్లోబల్ స్థాయిలో చైనా, అమెరికాతో పోటీ పడే శక్తివంతమైన ఆర్థిక బ్లాక్‌గా భాగస్వామ్యం నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.