తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని, తనది కాని ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడని, అందుకే చరిత్ర శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ జీని ధరమ్ ది చాదర్.. ఔర్ హింద్ ది ఛాదర్ గా కీర్తిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన బలిదానాన్ని యావత్ భారత దేశం సత్యం, సాహసం, భావోద్వేగంతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు.
సిక్కుల 10వ మత గురువు శ్రీ తేగ్ బహదూర్ జీ స్ఫూర్తితో ప్రతి పౌరుడు ధర్మాన్ని ఒక హక్కుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే కాదు బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని ధర్మ సాధన మార్గంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో ప్రముఖ సిక్కు గురువు శ్రీ తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ “350 ఏళ్లు గడచినప్పటికీ మనమంతా శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ జీ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష పెట్టిన ఘటన” అని తెలిపారు.
“1675 నవంబర్ 24వ తేదీన ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద పెద్ద సమూహం నిలబడి ఉన్నా అందరిలోనూ తెలియని భయం వ్యాపించి ఉంది. ఓ వైపు సమూహం మరోవైపు ప్రభుత్వం, ఇంకో వైపు ఓ శాంతి దూత ఉన్నారు. తన త్యాగంతో ధర్మ పరిరక్షణ సాధ్యమన్న విషయం ఆ దూతకి తెలుసు. బలిదానం అయిన ఆయన్ను తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. ఆయన బలిదానం నేడు పొరుగు దేశాల్లో ఉన్న హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తుంది” అని వివరించారు.
“గురు తేగ్ బహదూర్ జీ త్యాగం ఒక చరిత్ర మాత్రమే కాదు. మనందరికీ ఒక హెచ్చరిక. మన దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం అవసరం లేదు.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరం” అని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలని, నిజమైన బలం ఆధిపత్యంలో కాదు పరోపకారంలో ఉంటుందని చాటి చెప్పిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు మన దేశానికి మానవ విలువలను కాపాడే వీరత్వం, ఆత్మపరిశీలన చేసుకునే వివేకం కలిగిన నాయకత్వం అవసరం అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, సిక్కు మత పెద్దలు బాబా కుల్వంత్ సింగ్, బల్వేందర్ సింగ్ బాబా, బాబూ సింగ్ మహారాజ్. ఇతర మత పెద్దలు, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు.

More Stories
రాజ్యాంగమే భారత్ ప్రజాస్వామ్యానికి మూలస్థంభం
ధర్మేంద్రకు పద్మ విభూషణ్, అచ్యుతానందన్కు పద్మభూషణ్
సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నుమూత