భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశమైన భారతదేశానికి మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆదివారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ హోదా, గతం, వర్తమానం, భవిష్యత్తులో దేశ దిశానిర్దేశాన్ని చాటిచెప్పే అమూల్యమైన సందర్భం ఇదని చెప్పారు.
ప్రపంచంలో పలుచోట్ల అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువనుందని ఆమె గుర్తు చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశమైన భారతదేశానికి మూలస్తంభమని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిబంధనల ద్వారా పటిష్టమైన జాతీయ స్ఫూర్తిని, దేశ సమైక్యతను రాజ్యాంగ నిర్మాతలు పాదుకొలిపారని ఆమె చెప్పారు. బలమైన స్వాతంత్రోద్యమంతో 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిందని, స్వతంత్ర దేశ పౌరులుగా మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకునే హక్కు పొందామని, 1950 జనవరి 26 నుంచి మన గణతంత్ర దేశాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.
నారీశక్తి ప్రాధాన్యతను ద్రౌపది ముర్ము ప్రముఖంగా ప్రస్తావిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో నారీశక్తి కీలకమని చెప్పారు. సంప్రదాయ స్టీరియోటైప్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారని, దేశాభివృద్ధిలో చురుకుగా పాల్గొంటున్నారని ఆమె ప్రశంసించారు. వ్యవసాయ రంగం నుంచి అంతరిక్షం వరకూ, స్వయం ఉపాధి నుంచి సాయుధ బలగాల వరకూ మహిళలు ప్రతిరంగంలోనూ తమదైన బలమైన ముద్రను చాటుతున్నారని పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్‌లో ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌ను, బ్లయిండ్ ఉమన్ టీ-20 వరల్డ్ కప్‌ను మన ఆడకూతుళ్లు సొంతం చేసుకున్నారని రాష్ట్రపతి తెలిపారు. గత ఏడాది చెస్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇద్దరు భారతీయ మహిళల మధ్యే జరిగిందని ఆమె గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గించగలిగిందని ఆమె చెప్పారు.
జీఎస్‌టీ అమలు, ఒన్ నేషన్-వన్ మార్కెట్ వంటి నిర్ణయాలను ప్రశంసించారు. ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో జీఎస్‌టీ సిస్టమ్ మరింత సమర్థవంతంగా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయగలిగిందని ఆమె చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం సాధించిన విజయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రశంసించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలను వ్యూహాత్మకంగా సైన్యం ధ్వంసం చేసిందని, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధిని)కు ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని ఆమె కొనియాడారు.

More Stories
త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన గురు తేగ్ బహదూర్
ధర్మేంద్రకు పద్మ విభూషణ్, అచ్యుతానందన్‌కు పద్మభూషణ్
సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ కన్నుమూత