బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి సజీవ దహనం

బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి సజీవ దహనం

ఆందోళనలతో హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులపై దాడి చేయడం, హత్య చేయడం వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా తాజాగా  దుకాణంలో నిద్రిస్తున్న 23 ఏళ్ల హిందూ యువకుడిని కొందరు దుండగులు సజీవ దహనం చేశారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చంచల్ చంద్ర కుమిల్లా జిల్లా, లక్ష్మీపూర్ అనే గ్రామంలోని ఒక గ్యారేజ్‌లో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. అక్కడే షట్టర్ మూసి శుక్రవారం రాత్రి నిద్రపోయాడు. అతడు గ్యారేజ్‌లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్షణాల్లోనే మంటలు లోపలిదాకా వ్యాపించాయి. 

దీంతో చంచల్ చంద్ర లోపలే అగ్నికి ఆహుతి అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. దాదాపు అరగంటపాటు శ్రమించి, మంటల్ని ఆర్పేశారు. అనంతరం చంచల్ చంద్ర మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.

మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. వీరి తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. చంచల్‌ ఆదాయంపైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినమైన శిక్షను విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 

2025 డిసెంబర్లో 10 హత్యలతో సహా 51 హింస్మాతక ఘటనలు నమోదైనట్లు బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ (బీహెచ్‌బీసీయూసీ) పేర్కొంది. 10 హత్యల్లో ఏడుగురు హిందువులు మృతి చెందినట్లు పేర్కొంది. 2025 జనవరి నుంచి మార్చి మధ్యలో మైనారిటీలపై 142 దాడులు జరగ్గా, జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కేవలం ఆరోపణలతోనే సుమారు 71 దాడి ఘటనలు నమోదయ్యాయని చెప్పింది.