బడ్జెట్‌ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు

బడ్జెట్‌ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు
త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి.  జమిలి ఎన్నికలతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరో అంశం నియోజకవర్గాల పునర్విభజన. దీనికి సంబంధించి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతోందని, బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి.  సమావేశాల మొదటి రోజే జరగనున్న కేంద్ర క్యాబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్వోదయ పథకం కింద ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
ఫైనాన్స్‌ బిల్లులో భాగంగా ఆదాయ పన్ను చట్టాలను మరింత సరళీకరిస్తూ ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను, బ్యాంకింగ్‌ చట్టాల సవరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి.  ముస్లిం చారిటబుల్‌ ఆస్తులను నిర్వహించే అంశంలో గతంలో రూపొందించిన వక్ఫ్‌ చట్టానికి కూడా ఈ సమావేశాల్లో సవరణలు ప్రతిపాదించనున్నారు. డిజిటల్‌ పర్సనల్‌ డేటా పరిరక్షణ నిబంధనల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రంగాలను నియంత్రించేందుకు వీలుగా ఒక సంస్థను నెలకొల్పే బిల్లు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది.  దీనికి సంబంధించిన ‘వికసిత్‌ భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లు’ను గత డిసెంబరులోనే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. సెబీ, ఎస్సీఆర్‌ఏ డిపాజిటరీల చట్టాలను విలీనం చేస్తూ భారత స్టాక్‌ మార్కెట్‌ చట్టాలను ఆధునీకరించే ఉద్దేశంతో రూపొందించిన సెక్యూరిటీస్‌ మార్కెట్‌ కోడ్‌ బిల్లును సైతం బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.

27న అఖిలపక్ష సమావేశం

కంపెనీల దివాళా అప్పీళ్లను నిర్ణయించేందుకు సంబంధించిన దివాళా ఖాయిలా కోడ్‌ (సవరణ) బిల్లుపైనా బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే కంపెనీల దివాళా అప్పీళ్లపై ‘జాతీయ కంపెనీల లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌’ 3నెలల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 27న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రతిపక్షాలకు వివరించనుంది.

28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. మలి విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 9న మొదలై ఏప్రిల్‌ 2న ముగుస్తాయి.