స్టాలిన్- విజయ్ మధ్య తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!

స్టాలిన్- విజయ్ మధ్య తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే తమిళనాడులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారీ ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేక పోతుంది. మొదలైంది. పాత మిత్రుడిగా ఉన్న స్టాలిన్‌తోనే ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసి కొనసాగాలా? లేక కొత్తగా రంగంలోకి వచ్చిన హీరో విజయ్ పార్టీ టీవీకేతో చేతులు కళాపాలా? అనే మీమాంసలో పార్టీ చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది.
 
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ  ఓట్ల శాతం తగ్గుతున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ ఎన్నికల పొత్తు గురించి ఓ నిర్ణయానికి రాలేక పోతున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆదివారం కీలక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. 
 
ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, పొత్తుల అంశంపై స్పష్టత తీసుకురావడం ఈ భేటీ వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే 5200 మందికి పైగా ఆశావహుల నుంచి దరఖాస్తులు అందడం విశేషం.  కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చిచ్చు పెట్టాయి. 
 
కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్జీవో కాదని, ప్రభుత్వంలో తమకు కూడా వాటా ఉండాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అయితే, తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాలు పని చేయవంటూ డీఎంకే ఈ ప్రతిపాదనను కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలోనే 58 ఏళ్లుగా తమిళనాడులో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 
గతేడాది రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కాంగ్రెస్‌ పార్టీని తమకు సహజ మిత్రుడిగా అభివర్ణిస్తోంది. డీఎంకేతో సీట్ల సర్దుబాటు లేదా అధికారం పంపకంలో తేడాలు వస్తే తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ విజయ్‌తో కలిసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఆ రాష్ట్రంలో జోరందుకున్నాయి. 
 
అయితే కొత్త పార్టీతో వెళ్లడం ఒక సాహసమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. కాగా, తమిళనాడులో నానాటికీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం క్షీణిస్తోంది. 2011లో 9.3 శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు 2021 నాటికి 4.27 శాతానికి పడిపోయింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమిలో భాగంగా 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈసారి 40 కంటే ఎక్కువ సీట్లు కావాలని హస్తం పార్టీ పట్టుబడుతోంది.