రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గానూ భారత్‌పై విధించిన అదనపు పన్నులను ఎత్తివేసే యోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ప్రస్తుతం అమలు చేస్తున్న 25 శాతం టారిఫ్‌లను త్వరలోనే వెనక్కి తీసుకునే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికా విధించిన పన్నుల దెబ్బకు భారత రిఫైనరీలు రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారీగా తగ్గించాయని, ఇది తమకు దక్కిన అతిపెద్ద విజయమని ఆయన అభివర్ణించారు.
ఓ ఇంటర్వ్యూలో బెసెంట్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “రష్యా ఆయిల్ కొంటున్నందుకు మేం భారత్‌పై 25 శాతం పన్ను వేశాం. దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. భారత రిఫైనరీలు రష్యా నుంచి ఆయిల్ కొనడం దాదాపు మానేశాయి. అక్కడ కొనుగోళ్లు కుప్పకూలాయి. మా లక్ష్యం నెరవేరింది. ఇది కచ్చితంగా విజయమే. ప్రస్తుతం ఆ పన్నులు ఇంకా అమల్లోనే ఉన్నాయి. కానీ భారత్ ఇలాగే వ్యవహరిస్తే, దౌత్యపరమైన మార్గాల ద్వారా ఆ పన్నులను ఎత్తివేసే అవకాశం ఉంది. అదొక చెక్ పాయింట్ లాంటిది” అని బెసెంట్ వివరించారు.
ఇదే సమయంలో ఆయన ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ యూరప్ దేశాల ప్రవర్తనను ఆయన ‘మూర్ఖత్వం’ అని, ‘విడ్డూరం’ అని ఎద్దేవా చేశారు. “ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ రష్యా నుంచి కేవలం 2-3 శాతం ఆయిల్ మాత్రమే కొనేది. ఆంక్షల తర్వాత రష్యా తక్కువ ధరకే ఆయిల్ ఇవ్వడంతో భారత్ కొనుగోళ్లు పెంచింది” అని తెలిపారు.
“భారత రిఫైనరీలు ఆ ఆయిల్‌ను శుద్ధి చేసి భారీ లాభాలకు మళ్లీ ఐరోపాకే అమ్ముతున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రిఫైన్డ్ ఆయిల్‌ను యూరోపియన్లే కొంటున్నారు. అంటే పరోక్షంగా రష్యా ఆయిల్‌నే వాడుతున్నారు. మీపై జరిగే యుద్ధానికి మీరే డబ్బులు సమకూరుస్తున్నారు. రష్యాకు మీరే ఆర్థిక సాయం చేస్తున్నారు” అని బెసెంట్ యూరప్ దేశాలకు చురకలు అంటించారు.
ఐరోపా దేశాలు భారత్‌పై ఎందుకు పన్నులు వేయలేదో కూడా బెసెంట్ విశ్లేషించారు. అమెరికా మాదిరిగా యూరప్ ఎందుకు కఠినంగా లేదు? ఎందుకంటే వారికి భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కావాలి. దీనిని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్”గా వర్ణించారని గుర్తు చేశారు. సుమారు 200 కోట్ల మంది ప్రజలు, ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా ఉన్న మార్కెట్ ఇది. ఈ డీల్ కోసమే ఐరోపా దేశాలు “వర్చు సిగ్నలింగ్” చేస్తున్నాయని, భారత్‌ను ఏమీ అనడం లేదని బెసెంట్ విమర్శించారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఉర్సులా వచ్చే వారాంతంలో న్యూఢిల్లీకి రానున్నారు.

More Stories
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
హింసతో పాలిస్తున్న అప్రజాస్వామిక పాలనను ప్రతిఘటించాలి
ఇరాన్ వైపు అమెరికా కీలక సైనిక మోహరింపులు