కల్తీ నెయ్యి‌ కేసులో ముగిసిన సిట్ విచారణ

కల్తీ నెయ్యి‌ కేసులో ముగిసిన సిట్ విచారణ

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణను ముగించిన సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం సిట్ విచారణ 15 నెలలపాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ సాగింది. కేసు మూలాలు తొలుత తమిళనాడులో ఉన్నట్లు భావించగా బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు సూత్రధారులుగా సిట్ గుర్తించింది. ఇంక ఏపీతోపాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సిట్ పేర్కొంది.

ఛార్జిషీట్‌లో 24 మందిని నిందితులుగా సిట్ పేర్కొనగా మరో 12 మంది పాత్ర ఉన్నట్లు కోర్టుకు అధికారులు వెల్లడించారు. తొలుత కల్తీ నెయ్యి కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయింది.  విచారణలో సీబీఐలో డీఎస్పీలు, సీఐలతోపాటు రాష్ట్రానికి చెందిన 30 మంది అధికారులు ఉన్నారు.

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టిటిడి లో కీలక పదవుల్లో ఉన్నవారితో సహా పలువురిని సిట్‌ విచారణ చేసింది. స్వయంగా నెయ్యి వాడకాన్ని సమీక్షించింది. నెయ్యి కల్తీ విధానాన్ని గమనించింది. కావాల్సిన సమాచారం పైన ఆరా తీసింది. టిటిడి మాజీ ఈవో శ్యామల రావుతోనూ సిట్‌ చర్చించింది. కావాల్సిన సమాచారాన్ని సేకరించింది. 

కాగా, కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టిటిడి నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు ? కల్తీ నెయ్యి అని తెలిసినా.. తిరుమలకు ఎవరు అనుమతించారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిగింది.  ఈ కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీఎం చంద్రబాబు 2024 సెప్టెంబర్ 24వ తేదీన సిట్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘావిభాగాధిపతి మహేష్‌ చంద్ర లడ్హాలతో సీఎం చర్చించారు.

గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్‌ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది.  తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు తిరుమలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సిట్ నిగ్గు తెల్చాలని సూచించారు.  2024 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సిట్ విచారణ ప్రారంభించింది.