ఐ-ప్యాక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఈడీకి సుప్రీం అనుమతి

ఐ-ప్యాక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఈడీకి సుప్రీం అనుమతి
ఐ-ప్యాక్ అసోసియేట్ జితేంద్ర మెహతా మొబైల్ ఫోన్‌లో డేటాను పరిశీలనకు ఈడీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 8న దేశవ్యాప్తంగా ఐ-ప్యాక్ ఆఫీసులో సోదాలు జరిగినప్పుడు ఢిల్లీలోని కార్యాలయం ఈ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ శుక్రవారం మెహతాకు సమన్లు జారీచేశారు.
మెహతా తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది సీ ఏ సుందరం ఆయన గోప్యతకు భంగం కలుగుతుందని, ఫోన్‌లో డేటాను పరిశీలించకుండా ఈడీ నిలువరించాలని కోరారు.  దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ‘మీరెందుకు అంత భయపడుతున్నారు?’ అని ప్రశ్నించింది. ఈ కేసులో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తన క్లయింట్ ప్రాథమిక హక్కులను కాపాడాలని సుందరం అభ్యర్తించారు. ‘ఒక అమాయక పౌరుడిని ఎలా కాపాడాలో మాకు తెలుసు’ అని ధర్మాసనం బదులిచ్చింది. 
 
దీంతో, కోర్టు ఆయన దోషిగా భావిస్తోందని సుందరం వ్యాఖ్యానించారు. ఐ-ప్యాక్‌ ఢిల్లీ ఆఫీసులో డిజిటల్ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నప్పటికీ, కోల్‌కతాలో మాత్రం సాధ్యం కాలేదు. పశ్చిమ బెంగాల్ పోలీసు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదాలను అడ్డుకొని కోల్‌కతాలోని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పాత్రలను,  డిజిటల్ పరికరాలను తమవెంట తీసుకెళ్లారు.

మనీలాండరింగ్ కేసుల్లో నిందితుల ఫోన్లు, డిజిటల్ పరికరాలను పరిశీలించకుండా ఈడీపై విధించిన ఆంక్షలకు సంబంధించిన అన్ని కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకేసారి స్వీకరించి, మంగళవారం విచారణ జరపనుంది. 
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఫ్యూచర్ గేమింగ్, న్యూస్‌క్లిక్, ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో కూడా డిజిటల్ డేటాను ఈడీ యాక్సెస్ చేయకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినట్టు సమాచారం.

ఈ కేసుల్లో ప్రస్తుత చట్టాలు సరిపోవని, వ్యక్తిగత పరికరాలను యాక్సెస్ చేయడం ఆర్టికల్ 21 కింద గోప్యతా హక్కుకు, ఆర్టికల్ 20(3) కింద స్వీయ-నేరారోపణకు వ్యతిరేకంగా ఉందని వాదించారు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నిందితులు దర్యాప్తు సంస్థలు డిజిటల్ పరికరాలు తనిఖీలు, స్వాధీనం విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టును కోరారు. 
 
ఎందుకంటే వాటిల్లో వ్యక్తిగత డేటా కూడా ఉంటుంది. నవంబర్ 2023లో మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సమయం కోరిన కేంద్రం తర్వాత మార్గదర్శకాలను రూపొందించడానికి డైరెక్టర్ I4సి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు సిబిఐ మాన్యువల్‌ను అన్ని కేంద్ర ఏజెన్సీలు అనుసరించవచ్చని ప్రభుత్వం తెలిపింది.