హింసతో పాలిస్తున్న అప్రజాస్వామిక పాలనను ప్రతిఘటించాలి

హింసతో పాలిస్తున్న అప్రజాస్వామిక పాలనను ప్రతిఘటించాలి
* దేశ ప్రజలకు షేక్ హసీనా పిలుపు
 
ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్​ యూనస్​ ఒక ఫాసిస్ట్​, అవినీతిపరుడైన దేశద్రోహి, హంతకుడని  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరుగుతూ ఎన్నికైన ప్రభుత్వం కాకుండా, హింసతో పాలిస్తున్న ఈ అప్రజాస్వామిక పాలనను ప్రతిఘంటించాలని  దేశ ప్రజలకు పిలుపిచ్చారు. ఈ సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి అందరూ ఏకం క కావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
తన స్వార్థం కోసం యూనస్​ దేశాన్ని రక్తమోడించాడని చెబుతూ  ప్రస్తుతం బంగ్లాదేశ్​ ఒక భయానక అగాధంలో ఉందని, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్​ ఆసియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ షేక్ తన ఆడియో సందేశం ఇచ్చారు. “ప్రస్తుతం ఎక్కడ విన్నా విధ్వంసం మధ్య బతకడానికి పోరాడుతున్న ప్రజల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. అవి ప్రాణాల కోసం చేస్తున్న నిస్సహాయ అభ్యర్థనలు. ఉపశమనం కోసం గుండెలు పగిలేలా వేస్తున్న కేకలు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
“దేశ ద్రోహి, ఫాసిస్ట్ అయిన యూనస్​ తన తీవ్రవాద ముఠాతో కలిసి కుట్ర పన్ని, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన నన్ను బలవంతంగా 2024 ఆగస్టు 5న గద్దె దించారు. ఆ రోజు నుంచి దేశం ఒక క్రూరమైన, నిర్దాక్షిణ్యమైన, ఊపిరాడనీయని భయానక యుగంలోకి నెట్టవేయబడింది. ప్రజస్వామ్యం దేశ బహిష్కరణకు గురైంది” అని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్​లో తీవ్రమైన అరాచకత్వం, అభద్రత రాజ్యమేలుతున్నాయి. మైనారిటీలు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మూక దాడులు, లూటీలు, తీవ్రవాదం వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ బలహీనపడ్డాయి. న్యాయం కరువైంది” అని హసీనా పేర్కొన్నారు.
శాంతి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన ఐదు కీలక దశలను హసీనా వివరించారు: 1. ప్రస్తుత పరిపాలనను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించండి చడం, ఓటర్లపై భయం ఇకపై నీడ లేకుండా చూసుకోవడం. 2. వీధులలో హింసను వెంటనే కట్టడి చేయడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి పౌర సేవలు స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించడం.
3. మైనారిటీలు, మహిళలు, బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం, వారి గుర్తింపు లేదా నమ్మకాల కోసం ఎవరూ లక్ష్యంగా చేసుకోకుండా చూసుకోవడం, 4.  జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా ప్రేరేపించే బెదిరింపులను ఆపడం, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం, 5. సత్యం, సయోధ్య, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి గత సంవత్సరం జరిగిన సంఘటనలపై పూర్తి, నిష్పాక్షిక దర్యాప్తు కోసం ఐక్యరాజ్యసమితిని ఆహ్వానించడం.