తమిళనాడు ప్రజలు డీఎంకే, సీఎంసీలను కూల్చివేసేందుకు నిర్ణయించుకున్నారని, అక్కడ బీజేపీ-ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. తమిళనాడులోని మధురాంతకంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని స్పష్టం చేశారు.
“తమిళనాడు డీఎంకే దుష్పరిపాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటోంది. నిజానికి డీఎంకే అంటే ‘సీఎంసీ’ (అవినీతి, మాఫియా, నేరాలను ప్రోత్సహించే ప్రభుత్వం). దానికి ప్రజాస్వామ్యం, జవాబుదారీతనంతో పనిలేదు. అది కేవలం ఒక కుటుంబం కోసం పనిచేస్తోంది. డీఎంకేలో ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలను దూషించడం, మన సంస్కృతిని అవమానించడం వంటివే అర్హతలు” అంటూ ప్రధాని ధ్వజమెత్తారు.
డీఎంకే బారి నుంచి తమిళనాడును విడిపించాలని చెబుతూ అందుకే తమిళ ప్రజలు డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని తెలిపారు. “గత 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి గొప్ప కృషి చేసింది. తమిళనాడు అభివృద్ధి కోసం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిచే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం” అని ప్రధాని పేర్కొన్నారు.
“తమిళనాడు అభివృద్ధిలో యువశక్తి, మహిళా శక్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇక్కడి డీఎంకే ప్రభుత్వం మన యువతను మాదకద్రవ్యాలకు, డ్రగ్ మాఫియాకు అప్పగించింది. ఇక్కడ తల్లులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కళ్ల ముందే నాశనం కావడాన్ని చూస్తున్నారు. డ్రగ్ మాఫియాలు పాఠశాలలు, కళాశాలలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి” అంటూ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
“వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి ‘సెల్వి’ జయలలిత తమిళనాడులో నేరాలను నియంత్రించడానికి చాలా కృషి చేశారు. కానీ నేడు మహిళలు చాలా బాధలు పడుతున్నారు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం పెట్టే విషయంలో భక్తుల హక్కులకు అండగా మా నేతలు నిలిచారు. కానీ డీఎంకే ప్రభుత్వం మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు, భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. చివరకు న్యాయస్థానాలను కూడా వదలడం లేదు” అని మోదీ విమర్శించారు.
“ఎన్డీఏ సర్కార్ ‘మత్స్య సంపద యోజన’ను నిర్వహిస్తోంది. ఈ పథకం కింద మత్స్యకారులకు డీప్ సీ ఫిషింగ్ బోట్లను అందిస్తున్నారు. అంతేకాదు వారికి 50వేల కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం చిన్న రైతులు, మత్స్యకారులను సహకార సంఘాలతో అనుసంధానిస్తోంది. అంతేకాదు కర్షకుల కోసం రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్పీఓ)కు గొప్ప ప్రాధాన్యత ఇస్తోంది” అని ప్రధాని తెలిపారు.
తమిళనాడుకు ఆహార ప్రాసెసింగ్కు సంబంధించిన అపారమైన సామర్థ్యం ఉందని పేర్కొంటూ అందుకే తమిళ రైతుల, మత్స్యకారుల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరేలా ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తోందని మోదీ చెప్పారు. ఎన్నికల సంవత్సరంలో ప్రధాని మోదీ తొలిసారి తమిళనాడులో పర్యటించిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రామదాస్, టీఎంసీ-ఎం నేత జీకే వాసన్ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు.
More Stories
కాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయం ఏకాత్మతా మానవతావాదం
శశి థరూర్ పార్టీ మీటింగ్ కు గైరాజర్.. మోదీ సభకు హాజరు
విశాఖ రైల్వే స్టేషన్లో ‘హ్యూమనాయిడ్ రోబో’