ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తో మంది కొంపలు ముంచిన కేటీఆర్ ను సాక్షిగా విచారణకు పిలిచి వాంగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఫాంహౌజ్ కు, ఏఐసీసీకి మధ్య డీల్ కుదిరేదాకా ఫోన్ ట్యపింగ్ విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తారని ఆయన ఆరోపించారు.
సమర్ధవంతమైన, నిజాయితీవంతులైన అధికారులు సిట్ లో ఉన్నారని చెప్పిన బండి సంజయ్ వారిని స్వేచ్ఛగా పని చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేస్తూ తాను చెప్పినట్లుగా విచారణ చేయిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఫోన్ ట్యాపింగ్ విచారణను చూసి నవ్వుకుంటున్నారని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత తేటతెల్లమవుతోందని చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నరని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని సంజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి, కేంద్రం నిర్వహిస్తున్న ఉద్యోగాల భర్తీకి ఉన్న తేడాను గమనించాలని ఆయన కోరారు. ‘‘టీజీపీఎస్సీ అంటేనే లీకేజీలు, పైరవీలు, కోర్టు కేసులు, ఆందోళనలు, ధర్నాలతో ఏళ్ల తరబడి సాగుతున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం ఒక్క పైరవీకి, అవినీతికి, లీకేజీలకు ఆస్కారం లేకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది’’అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసినా చేయకపోయినా నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడుతూ పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు.
కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని చెబుతూ గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని, కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని సంజయ్ కుమార్ విమర్సించారు. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ లేఖ రాస్తే, బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని మంత్రి భట్టి చెబుతున్నారని చెప్పారు. సింగరేణిలో రెండు పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు.

More Stories
జిహెచ్ఎంసిలో విలీనంతో గ్రామస్థుల జీవనం అస్తవ్యస్తం
ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం
మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు