ప్రపంచ పౌర విమానయాన రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా (బోయింగ్), యూరప్ (ఎయిర్‌బస్) సంస్థల గుత్తాధిపత్యానికి తెరదించేందుకు రష్యా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న విమానయాన మార్కెట్‌ను అందిపుచ్చుకుంటూనే ఇక్కడే విమానాలను తయారు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలు కూడా తుది దశకు చేరుకున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమానాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా కొత్త విమానాల డెలివరీకి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో రష్యా తన పౌర విమానాలను భారత్‌కు ఆఫర్ చేస్తోంది. 1500 కిలో మీటర్ల లోపు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం సుఖోయ్ సూపర్ జెట్ (ఎస్ ఎస్ జె)-100, ఇల్యూషిన్ (ఐఎల్)-114లను తీసుకు వస్తోంది. అయితే ఇవి చిన్న రన్‌వేలపై కూడా సులభంగా ల్యాండ్ కాగలవు.అలాగే 3000 కిలోమీటర్ల వరకు వెళ్లే మధ్యస్థ శ్రేణి కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఎస్-21ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.6500 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణాల కోసం బోయింగ్ 767కు ధీటుగా నిలిచే అత్యాధునిక టియు-214 విమానాలను తయారు చేయబోతున్నారు. అయితే ఈ విమానాలకు ఉండే ఇంజిన్లు, ఇంటీరియర్స్, ఇతర కీలక భాగాలు పూర్తిగా రష్యా స్వదేశీ సాంకేతికతతోనే తయారు అయ్యాయి. పాశ్చాత్య విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం విమానాల విక్రయానికే పరిమితం కాకుండా భారత్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)తో కలిసి సంయుక్తంగా ఈ విమానాలను తయారు చేసే అంశంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. రష్యా దేశం వెలుపల తమ విమానాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కానుంది.
దీనివల్ల భారత విమానయాన సంస్థలకు విమానాల కొరత తీరడమే కాకుండా విడిభాగాల లభ్యత, మరమ్మతుల భారం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ‘వింగ్స్ ఇండియా 2026’ ఎయిర్ షో రష్యా విమానాలకు ప్రధాన వేదిక కానుంది. ఈ షోలో ఎస్ ఎస్ జె-100, ఐఎల్-114 విమానాలను రష్యా ప్రదర్శించనుంది. విమానం బాహ్య రూపమే కాకుండా, లోపల సీటింగ్, ఇతర అత్యాధునిక ఏర్పాట్లను కూడా ఇక్కడి సందర్శకులు స్వయంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. రష్యా ఈ స్థాయిలో తన పౌర విమానాలను విదేశీ గడ్డపై ప్రదర్శించడం ఇదే ప్రథమం.
More Stories
అనిల్ అంబానీ కార్పొరేట్ మోసాలపై విచారణకు సుప్రీం ఆదేశం
ఈయూ జీఎస్పీ రద్దుతో భారత్ ఎగుమతులపై పిడుగు
పెట్టుబడిదారులకు భారత్ బ్రైట్ స్పాట్