మనుగడలో లేని కంపెనీ నుండి ఐ-ప్యాక్ కు రూ. 13.50 కోట్ల రుణం

మనుగడలో లేని కంపెనీ నుండి ఐ-ప్యాక్ కు రూ. 13.50 కోట్ల రుణం
జనవరి 8న కోల్‌కతాలోని తమ డైరెక్టర్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నప్పటి నుండి రాజకీయ తుఫాను కేంద్రంగా మారిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) అనే రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ, 2021లో రోహ్‌తక్‌కు చెందిన ఒక సంస్థ నుండి రూ. 13.50 కోట్ల “అసురక్షిత రుణాన్ని” పొందింది. అయితే, ఆ సంస్థ అధికారిక రికార్డులలో ఉనికిలో లేదు.
 
రోహ్‌తక్‌లోని అదే చిరునామాలో ఉన్న ఇలాంటి పేరు గల ఒక సంస్థ, ప్రకటించిన లావాదేవీకి మూడు సంవత్సరాల ముందే, ఆగస్టు 2018లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసి) రికార్డుల నుండి ఆ కంపెనీని తొలగించారు. దానిలో నమోదైన ఆరుగురు వాటాదారులు కూడా ఐ-ప్యాక్‌తో ఎలాంటి లావాదేవీలు జరపడం లేదా దానికి రుణం ఇవ్వడం గురించి తమకు తెలియదని నిరాకరించారు.
 
ఆర్ఓసి  ఫైలింగ్‌ల ప్రకారం, ఐ-ప్యాక్ డిసెంబర్ 17, 2021 నాటి ఒక పత్రంలో “రుణదాతల జాబితా”ను జతచేసి, ‘రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (పి) లిమిటెడ్’ అనే కంపెనీ నుండి రూ. 13.50 కోట్లను “అసురక్షిత రుణం” రూపంలో పొందినట్లు ప్రకటించింది. ఐ-ప్యాక్ పత్రంలో అందించిన రుణదాత చిరునామా ‘3వ అంతస్తు, అశోక ప్లాజా, ఢిల్లీ రోడ్, రోహ్‌తక్, హర్యానా’. రోహ్‌తక్‌లోని ఆ చిరునామాను సందర్శించగా, ఆ ప్రాంగణం నుండి అలాంటి కంపెనీ ఏదీ పనిచేయడం లేదని వెల్లడైంది.
 
అంతేకాకుండా, ఆర్ఓసి రికార్డులనుపరిశీలించగా, ‘రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (పి) లిమిటెడ్’ అనే పేరుతో ఏ కంపెనీ కూడా ఎప్పుడూ నమోదు కాలేదని తేలింది. అధికారిక రికార్డులలో ఉన్నది ‘రామ్‌సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఇలాంటి పేరు గల సంస్థ మాత్రమే.  దీనిని అక్టోబర్ 2013లో అదే రోహ్‌తక్ చిరునామాలో స్థాపించారు. అయితే, ఆ కంపెనీని ఐ-ప్యాక్ రుణం ప్రకటించడానికి మూడు సంవత్సరాల ముందు, ఆగస్టు 8, 2018న ఆర్ఓసి తొలగించింది.
 
జూన్ 27, 2025న చేసిన మరో ప్రకటనలో, ఐ-ప్యాక్ రూ. 13.50 కోట్ల రుణంలో రూ. 1 కోటిని 2024-25లో “తిరిగి చెల్లించినట్లు”, రూ. 12.50 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపింది. ఆర్ఓసి పత్రాల ప్రకారం, రామ్‌సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 248 (1) ప్రకారం రద్దు చేయబడింది.
 
 ఆర్ఓసి పత్రాలలో, రామ్‌సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,  సునీల్ గోయల్ (రోహ్‌తక్‌లోని అశోకా ప్లాజాకు చెందిన ఇతరులుతో కలిసి) మధ్య అశోకా ప్లాజా 3వ అంతస్తు ప్రాంగణాన్ని అద్దెకు తీసుకునేందుకు అక్టోబర్ 8, 2013 నాటి అద్దె ఒప్పందం ఉంది. అశోకా ప్లాజాలో సునీల్ గోయల్ మేనేజర్‌గా ఉన్న సత్వీర్ మాట్లాడుతూ, తాను అక్కడ ఆరేళ్లకు పైగా పనిచేశానని, అక్కడ రామ్‌సేతు లేదా రామ్‌సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదీ లేదని చెప్పారు. 
 
రామ్‌సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించినప్పుడు ఆరుగురు వ్యక్తులు వాటాదారులుగా పేర్కొన్నారు: విక్రమ్ ముంజల్ (రోహ్‌తక్); సందీప్ రాణా (హిసార్); విజేందర్ (జింద్); బల్జిత్ జాంగ్రా (హిసార్); ప్రదీప్ కుమార్ (హిసార్); జగ్బీర్ సింగ్ (సోనిపట్). ఈ ఆరుగురు వాటాదారులు కూడా కంపెనీ స్థాపించిన కొన్ని సంవత్సరాలకే మూసివేసిన్నట్లు చెప్పారు. ఐ-ప్యాక్‌కు ఏదైనా రుణం ఇచ్చిన విషయం తమకు తెలియదని ఖండించారు. 
 
ప్రస్తుతం గురుగ్రామ్‌లో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సందీప్ రాణా మాట్లాడుతూ, “మేము సంస్థను ప్రారంభించాము కానీ ఎలాంటి వ్యాపారం చేయలేదు. దానిని త్వరలోనే రద్దు చేసాము. అలాంటి లావాదేవీ గురించి నాకు తెలియదు.” జింద్‌లో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న విజేందర్ మాట్లాడుతూ, భూముల లావాదేవీల కోసం కంపెనీని ఏర్పాటు చేశామని, అయితే ప్రారంభంలోనే ఒక ఒప్పందం విఫలమవడంతో దానిని వదిలేశామని చెప్పారు.
 
ఆర్ఓసి ఫైలింగ్‌ల ప్రకారం, ఐ-ప్యాక్ ను ఏప్రిల్ 13, 2015న పాట్నాలో స్థాపించారు. ఫిబ్రవరి 2022లో తన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కోల్‌కతాకు మార్చింది. కంపెనీ డైరెక్టర్లు, వాటాదారులు – ప్రతీక్ జైన్, రిషిరాజ్ సింగ్, వినేష్ చందేల్ – దాని స్థాపన నుండి మారకుండా ఉన్నారు.