‘స్వచ్ఛ నగరం’గా వరుసగా ఎనిమిదేళ్లు జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన మధ్యప్రదేశ్‌లోని ‘ఇండోర్’లో మరోసారి కలుషిత నీటితో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. ఇండోర్ జిల్లాలోని మోవ్ తహసీల్‌లో కలుషిత నీరు తాగడంతో 24 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి పట్టి బజామ్ మరియు చందర్‌మార్గ్ ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా సంక్రమించే వ్యాధుల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు.
కలుషిత నీరు తాగడంతో కామెర్ల బారినపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇండోర్ కలెక్టర్ శివం వర్మ మోవ్‌కుచేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, బాధిత ప్రాంతాల్లోని నివాసితులతో మాట్లాడారు. తాగు నీరు కలుషితమైనట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.స్కూల్ పిల్లలు అస్వస్థత చెందడంతో తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ముఖ్యమైన పరీక్షలు రాయలేకపోయారు.
12వ తరగతి చదువుతున్న అలేనా అనారోగ్యం కారణంగా ప్రీ బోర్డు పరీక్షలకు హాజరుకాలేకపోయింది. కొందరు ఆరోగ్య శాఖ సిబ్బంది సంఘటనా స్థలంలో పర్యటిస్తున్నట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సిఎంహెచ్‌ఒ) తెలిపారు. ఇండోర్ మెడికల్ కాలేజీ నుండి ఒక బృందం, ఇతర వైద్య నిపుణులను కూడా ఆ ప్రాంతానికి పంపుతున్నామని చెప్పారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
గత నెలలో, ఇండోర్‌లోని భగీరత్‌పుర ప్రాంతంలో అనేకమంది కలుషిత నీటితో అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కలుషిత నీరు ఇప్పటివరకు 25 మంది ప్రాణాలను బలిగొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఐదునెలల బాలుడు సహా ఏడు మరణాలు నమోదయ్యాయని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2026,జనవరి 15న హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

More Stories
లష్కరే తోయిబాలో చేర్పిస్తున్న కీలక నిందితుడికి పదేళ్లు జైలు
ఢిల్లీలో వర్షం.. కశ్మీర్లో ఆలస్యంగా మంచు
ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు మృతి