వచ్చే నెల ఫిబ్రవరి 7న భారత్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ జట్టు పర్యటించదని, ఈ టోర్నమెంట్ ను తప్పుకుంటున్నట్లు బిసిబి ప్రకటించింది. గురువారం జరిగిన అంతర్గత బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిబి వెల్లడించింది.
బిసిబి అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆడాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంటూనే, భారతదేశంలో ఆడటాన్ని మరోసారి నిరాకరించారు. 2026 ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి తొలగించిన సంఘటనను ఆయన ప్రస్తావించారు.
“నిన్న రాత్రి ఐసిసి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఇది కేవలం ఒకే ఒక్క సమస్య కాదు” అని ఆయన పేర్కొన్నారు. “మ్యాచ్‌లను భారత్ నుండి వేరే చోటికి మార్చాలని పాలక మండలిని కోరాం. కానీ, సమస్యకు పరిష్కారించడంలో ఐసిసి విఫలమైంది” అని విచారం వ్యక్తం చేశారు. “మేము ఐసిసితో సంప్రదింపులు కొనసాగిస్తాము. ప్రపంచ కప్‌లో ఆడాలనుకుంటున్నాము, కానీ భారతదేశంలో ఆడము. మేము పోరాడుతూనే ఉంటాము” అని తెలిపారు.
“ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని దిగ్భ్రాంతికరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముస్తాఫిజుర్ సమస్య కేవలం ఒకే ఒక్క సమస్య కాదు. ఆ విషయంలో వారే (భారతదేశం) ఏకైక నిర్ణయాధికారులు. మా మ్యాచ్‌లను భారతదేశం నుండి వేరే చోటికి మార్చాలన్న మా అభ్యర్థనను ఐసిసి తిరస్కరించింది” అంటూ విచారం వ్యక్తం చేశారు. “ప్రపంచ క్రికెట్ స్థితి గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. దాని ప్రజాదరణ తగ్గుతోంది. వారు 20 కోట్ల మంది ప్రజలను దూరం చేశారు. క్రికెట్ ఒలింపిక్స్‌కు వెళ్తోంది. కానీ మా లాంటి దేశం అక్కడికి వెళ్లకపోతే, అది ఐసిసి వైఫల్యమే” అని అమీనుల్ ఇస్లాం బుల్బుల్ స్పష్టం చేశారు.
ఒకవేళ, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగితే, ఫిబ్రవరి 7న టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయంగా చేర్చుకుంటామని ఇప్పటికే ఐసీసీ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచ కప్ ప్రారంభ రోజునే ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది. తర్వాత కోల్‌కతాలో బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. చివరి లీగ్ మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఐసిసి మొత్తం షెడ్యూల్‌ను మార్చకుండా, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చనుంది.

More Stories
‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఛార్టర్‌పై ట్రంప్ సంతకం
గ్రీన్‌ల్యాండ్ స్వాధీనంకు మద్దతు ఇవ్వని దేశాలపై సుంకాలు రద్దు
బంగ్లాదేశ్ భారత్ లో మ్యాచులు ఆడాల్సిందే