జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో ఓ ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భదర్వ-చంబా అంతరాష్ట్ర రహదారిలోని ఖన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
గాయపడిన వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వీరిని ఉధంపూర్ మిలిటరీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది సైనికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం అబ్దుల్లా, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
“దోడా జిల్లాలో జరిగిన ప్రమాదంలో 10 మంది సైనికులు వీరమరణం పొందడం విచారకరం. దేశానికి వారు చేసిన సేవలను, త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. వీరమరణం పొందిన కుటుంసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయంలో మీతో దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. గాయపడిన 10 మంది సైనికులను ఎయిర్ లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించాం. వారిగి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.” అని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఇలాంటి విషాదంలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు, ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజులకే ఈ ప్రమాదం జరిగింది. జనవరి 8న గుల్మార్గ్ సెక్టార్‌లోని అనితా పోస్ట్‌కు వెళ్తుండగా పోర్టర్లు లోతైన లోయలో జారిపడ్డారు. నిరంతర సహాయక చర్యల తర్వాత మరుసటి రోజు వారి మృతదేహాలను వెలికితీశారు.
తాజా సంఘటన మరోసారి జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రదేశాలు, మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు ఆర్మీ సిబ్బంది ఎదుర్కొంటున్న తీవ్ర ప్రమాదాలను వెల్లడి చేస్తుంది. అక్కడ సైన్యం దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ రెస్క్యూ బృందాలను మోహరించారు.

More Stories
గణతంత్ర వేడుకలే లక్ష్యం గా పాక్ ఉగ్రవాదులు
జార్ఖండ్‌లో 15 మంది మావోయిస్టులు మృతి
ఢిల్లీ గాలి కాలుష్యంపై నాలుగు వారాల్లో ‘యాక్షన్ ప్లాన్’