రెండు పంక్తులతో ప్రసంగం ముగించిన కర్ణాటక గవర్నర్

రెండు పంక్తులతో ప్రసంగం ముగించిన కర్ణాటక గవర్నర్
 
కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశంలో తన సాంప్రదాయ ప్రసంగాన్ని రెండు ప్రారంభ పంక్తులు మాత్రమే చదివి గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ ముగించారు. సభ్యులను పలకరించిన తర్వాత, గవర్నర్‌.. ”ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక, భౌతిక అభివృద్ధిని  రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జై హింద్‌, జై కర్ణాటక” అని ఆయన హిందీలో చదివారు.
 
తమిళనాడు, కేరళ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన పూర్తి ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు. క‌ర్నాట‌క స‌ర్కారు రూపొందించిన‌ ప్ర‌సంగంలోని 11 పేరాల‌పై గ‌వర్న‌ర్ థావ‌ర్‌చాంద్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో ప్రతిపాదిత వీబీ జీ రామ్ జీ బిల్లుకు సంబంధించిన ప్రస్తావనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ప్రభుత్వ ప్రచారంతో సమానమని వాదించారు. గవర్నర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో ‘షేమ్ షేమ్’ అని నినాదాలు చేశారు. 
గవర్నర్ లేచి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ ఆయనను చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. సభలో గందరగోళం, నిరసనల మధ్య మార్షల్స్ జోక్యం చేసుకుని గహ్లోత్‌ను బయటకు తీసుకెళ్లారు.  శాసనసభ నుంచి వెళ్లిపోతున్న గవర్నర్ గహ్లోత్​ను కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ అసెంబ్లీ గేటు వద్ద ఆపి, ప్రసంగాన్ని పూర్తి చేయాలని కోరారు. అయితే గహ్లోత్‌ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ చర్యను ఖండించారు.
 
గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ తీరుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగానికి బదులుగా గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదివారని ఆరోపించారు. గహ్లోత్ రాజ్యాంగం నిర్దేశించిన విధులను, బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సిద్ధం చేసిన పూర్తి ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించారని మండిపడ్డారు. గహ్లోత్ వైఖరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం గురించి పరిశీలిస్తున్నామని వెల్లడించారు.