ఢిల్లీ గాలి కాలుష్యంపై నాలుగు వారాల్లో ‘యాక్షన్ ప్లాన్’

ఢిల్లీ గాలి కాలుష్యంపై నాలుగు వారాల్లో ‘యాక్షన్ ప్లాన్’

కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి ఊపిరి పోయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి, ఇతర సంబంధిత వర్గాలకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్  (సిఎక్యూఎం) సూచించిన సిఫార్సులను ఎలా అమలు చేస్తారో చెబుతూ, రాబోయే 4 వారాల్లోగా సమగ్రమైన ‘యాక్షన్ ప్లాన్’ సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

కాలుష్య నివారణ చర్యల విషయంలో ఇకపై ఎలాంటి సాకులు, అభ్యంతరాలు వినేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని అరికట్టడానికి దీర్ఘకాలిక చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

ఈ కేసులో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి సిఎక్యూఎం మొత్తం 15 దీర్ఘకాలిక చర్యలను సిఫార్సు చేసిందని కోర్టుకు తెలిపారు. వీటిని అమలు చేయడానికి బాధ్యతగల ఏజెన్సీలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. నిధుల కోసం ‘ఎన్విరాన్‌మెంట్ కాంపెన్సేషన్ ఛార్జ్ ఫండ్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సిఎక్యూఎం  నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం “ సిఎక్యూఎం సూచించిన ఈ 15 చర్యలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు ఇంకా ఏమైనా అదనపు చర్యలు అవసరమైతే వాటిని కూడా చేర్చండి. కానీ వీటిని అమలు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదు. మేం వాటిని వినడానికి సిద్ధంగా లేము. సంబంధిత వాటాదారులందరూ తక్షణమే తమ కార్యాచరణ ప్రణాళికను కోర్టు ముందు ఉంచాలి” అని ఆదేశించింది.

కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. “కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను దశలవారీగా రోడ్ల నుంచి తొలగించాలి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) విధానాన్ని మరింత బలోపేతం చేయాలి. రైలు రవాణా వ్యవస్థను, మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని సవరించి, వాటి వాడకాన్ని పెంచాలి” అని చెప్పింది. 

ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్  “గతంలో కూడా ఇలాంటి ప్రణాళికలు చాలా వచ్చాయి. కానీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అందుకే ఈసారి ప్రతి పనికి ఒక కచ్చితమైన సమయ పాలన ఉండాలి” అని కోర్టును కోరారు.