స్టాక్‌మార్కెట్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి

స్టాక్‌మార్కెట్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి.  అమెరికా, ఐరోపా మధ్య టారిఫ్‌ అనిశ్చితి, భౌగోళిక, రాజకీయ పరమైన ఉద్రిక్తతలు,ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి మధ్య సూచీలు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చెంజీ సూచీ సెన్సెక్స్‌ ఓ దశలో 1200 పాయింట్లకు పైగా నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ కూడా 25,200 దిగువకు చేరింది.
చివరిలో కొంతమేర కోలుకున్నప్పటికీ, సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ఈ ఒక్కరోజు పతనంతోనే మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గింది. ఉదయం సెన్సెక్స్‌ 83,207.38 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై, రోజంతా నెగెటివ్‌ ట్రెండ్‌ లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,010.58 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన అనంతరం, చివరికి 1,065.71 పాయింట్ల నష్టంతో 82,180.47 వద్ద ముగిసింది. 
 
నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232.50 వద్ద స్థిరపడింది. డాలర్‌ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.97గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక్కటే లాభాల్లో నిలవగా, మిగతా అన్ని స్టాక్స్‌ నష్టపోయాయి. ముఖ్యంగా ఎటెర్నల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, ఇండిగో, ట్రెంట్‌ షేర్లు తీవ్రంగా పడిపోయాయి.  అటు గ్రీన్‌లాండ్‌ విషయంలో తనకు సహకరించకుంటే టారిఫ్‌లు విధిస్తానని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే మళ్లీ టారిఫ్ వార్‌ భయాలు మార్కెట్లలో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది.  గ్లోబల్ టారిఫ్ విధానంపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించడంతో మార్కెట్లపై ప్రభావం పడింది. విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎఫ్‌ఐఐలు సోమవారం కూడా రూ.3263 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఫలితంగా దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.