వీధి కుక్కల విషయంలో మేనకా గాంధీది కోర్టు ధిక్కారమే

వీధి కుక్కల విషయంలో మేనకా గాంధీది కోర్టు ధిక్కారమే

కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల సమస్యపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను బహిరంగంగా విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ‘కోర్టు ధిక్కరణ’ కిందకు వస్తాయని దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది.  ఎవరినీ వదలకుండా, కనీస ఆలోచన లేకుండా ఆమె అందరిపైనా ఇష్టానుసారం వాఖ్యలు చేస్తున్నారని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉగ్రవాది అజ్మల్ కసబ్ ప్రస్తావన రావడం విచారణలో కొంత ఉద్రిక్తతను పెంచింది. వీధి కుక్కల బెడద కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం మేనకా గాంధీ తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్‌ను నిలదీసింది.

“మీ క్లయింట్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో గమనించారా? ఆమె పాడ్‌కాస్ట్ మీరు విన్నారా? ఆమె బాడీ లాంగ్వేజ్ చూశారా? ఎవరినీ వదలకుండా, కనీస విచక్షణ లేకుండా అందరిపై ఇష్టానుసారం వాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన తీరు కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుంది” అని న్యాయవాదిపై ధర్మాసనం సీరియస్ అయింది. వాదనల సమయంలో అత్యంత ఆసక్తికర, ఘాటు సంభాషణ జరిగింది. 

మేనకా గాంధీ తరఫు న్యాయవాదిని జస్టిస్ మెహతా మరో కీలక ప్రశ్న అడిగారు. “మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా పనిచేశారు కదా. మరి వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయించేలా చేశారు? ఈ సమస్య పరిష్కారానికి మంత్రి హోదాలో ఆమె చేసిందేమిటి?” అని ప్రశ్నించారు. 

దీనికి న్యాయవాది రాజు రామచంద్రన్ స్పందిస్తూ, “నేను గతంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరఫున కూడా వాదించాను. బడ్జెట్ అనేది విధానపరమైన అంశం” అని ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి జస్టిస్ నాథ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “అజ్మల్ కసబ్ ఉగ్రవాదే కావచ్చు, కానీ అతను ఏనాడూ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు. కానీ మీ క్లయింట్ (మేనకా గాంధీ) మాత్రం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు” అని చురకలు అంటించారు.

మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని ధర్మానసం అభిప్రాయపడింది. “ఆమె చేసింది ముమ్మాటికీ తప్పే. అయితే కేవలం కోర్టుకున్న ఔదార్యం కారణంగానే మేం ఇప్పుడు ఆమెపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవడం లేదు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికింది.