ముంబై మేయర్ ఎన్నికలో కీలకంగా`రిజర్వేషన్’ పక్రియ

ముంబై మేయర్ ఎన్నికలో కీలకంగా`రిజర్వేషన్’ పక్రియ
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మిత్రపక్షం శివసేనతో కలిసి స్పష్టమైన ఆధిక్యం లభించడంతో మొదటిసారిగా మేయర్ పదవిని పొందేందుకు బీజేపీ ఉత్సకతో ఎదురు చూస్తున్నది. అయితే మేయర్ పదవి రిజర్వేషన్ అంశం ఈ ఎన్నికలో కీలకం కానున్నది.  గురువారం జరిపే లాటరీలో మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారు కానుంది. ఒక వేళ షెడ్యూల్డ్ కులాల వ్యక్తికి మేయర్ పదవి రిజర్వు అయిన పక్షంలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ బిజెపి లేదా దాని మిత్రపక్షం ఎకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మేయర్ పదవి పొందే అవకాశం లేదు.
 
అందుకనే, ప్రతిపక్షాలు మేయర్ పదవి పొందేందుకు 8 మంది సభ్యుల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే ఇంకా ఆశ వదులుకోలేదు. `అంతా దైవ నిర్ణయం’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. దైవ నిర్ణయం ఉంటె సంఖ్యాబలం లేకపోయినా మేయర్ పదవి పొందగలమనే సంకేతం ఇస్తున్నారు.  మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బీఎంసీతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను జనవరి 22న లాటరీ ద్వారా ప్రకటించనున్నారు. 
ఒకవేళ లాటరీలో బీఎంసీ మేయర్ పదవి షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయితే, ఈ పోటీ లెక్కలన్నీ మారిపోతాయి.  ఎందుకంటే మహాయుతిలో ఆ వర్గానికి చెందిన ఒక్క కార్పొరేటర్ కూడా లేరు, కానీ ఠాక్రే వర్గంలో ఇద్దరు ఉన్నారు. ఆ స్థానం షెడ్యూల్డ్ కులాల పురుషుడికి లేదా మహిళకు రిజర్వ్ అయినా, ఆ సందర్భంలో ప్రయోజనం ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికే ఉంటుంది. ఆయన పక్షాన షెడ్యూల్డ్ కులాల కేటగిరీ నుండి ఎన్నికైన ఇద్దరు కార్పొరేటర్లు జితేంద్ర వాల్వీ (వార్డు 53) మరియు ప్రియదర్శిని ఠాక్రే (వార్డు 121).
 
జనవరి 22న జరిగే లాటరీలో ఈ ‘అద్భుతం’ జరిగితే, భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ తాళాలు ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి పక్కాగా చేరవచ్చు. బీఎంసీ నిబంధనల ప్రకారం, మేయర్ పదవి జనరల్, షెడ్యూల్డ్ కులాలు, ఓబీసీ, మహిళల కేటగిరీల మధ్య రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ కేటాయింపు ఖరారు కాకపోవడంతో, ప్రస్తుత లాటరీ అవసరమైంది. 
 
ఆ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షమైన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) 29 స్థానాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, రిజర్వేషన్ కేటగిరీ తెలిసే వరకు మహాయుతిలో కూడా ఆందోళన నెలకొంది. ఒకవేళ మేయర్ పదవి జనరల్, ఓబీసీ లేదా మహిళల కేటగిరీకి రిజర్వ్ అయితే, ఆ కూటమి తమ సొంత మేయర్‌ను ఎన్నుకునే స్థితిలో ఉంటుంది.