భారత్ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరాయని స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయెన్ ప్రకటించారు. అయితే, భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుతో ముడిపడిన కొన్ని ప్రక్రియలు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె తెలిపారు.
ఈ ఒప్పందం చారిత్రకమైందని, కొంతమంది దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కొనియాడుతున్నారని ఆమె చెప్పారు. ఈ వాణిజ్య ఒప్పందం ఖరారైతే 200 కోట్ల మందితో కూడిన స్వేచ్ఛాయుత మార్కెట్ ఏర్పడుతుందని ఆమె తెలిపారు. ఈ మార్కెట్ ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో దాదాపు పావు భాగం (25 శాతం) జనాభా అవసరాలను తీరుస్తుందని ఉర్సులా వాన్ డెర్ లీయెన్ తెలిపారు.
వాణిజ్య భాగస్వామ్యాలను కుదుర్చుకునే విషయంలో వైవిధ్యాన్ని మరింత పెంచే దిశగా ఈయూ అడుగులు వేస్తోందని ఆమె చెప్పారు. ‘‘దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు ముగియగానే నేను నేరుగా భారత పర్యటనకు వెళ్తున్నాను. భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను వేగవంతం చేసేందుకు నా పర్యటన దోహదపడుతుందని ఆశిస్తున్నాను” అని ఆమె తెలిపారు.
“దీంతోపాటు ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఐరోపా, భారత్ మధ్య సహకార భావనను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రపంచ దేశాలతో కలిసి నడిచేందుకు ఈయూ రెడీగా ఉంది. ఈయూను ఎంపిక చేసుకునేందుకు ప్రపంచం కూడా సిద్ధంగానే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం, సహకారాన్ని పెంచడమే మా లక్ష్యం’’ అని ఉర్సులా వాన్ డెర్ లీయెన్ తెలిపారు.
‘‘పెట్టుబడులను ఆకర్షించగల ప్రోత్సాహకర సుస్థిర వాతావరణం, వాణిజ్య వికాసం, సుస్థిర ఆర్థిక పురోగతి అనే లక్ష్యాలను సాధించడమే ఐరోపా దేశాల ఉమ్మడి వ్యూహం. ఈ విధానంతోనే మేం ప్రపంచ దేశాలతో వాణిజ్య మార్గాల్లో కనెక్ట్ అవుతున్నాం. ఇంధన రంగంపైనా ఈయూ ప్రధాన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఐరోపా దేశాల వికాసానికి ఇంధనం అత్యంత కీలకమైంది” అని ఆమె పేర్కొన్నారు.
ఐరోపా దేశాలన్నీ కలిసికట్టుగా ప్రత్యేక ఇంధన యూనియన్‌ను నిర్మించే ప్రణాళికలో ఉన్నాయని చెబుతూ దీని ద్వారా ఐరోపా ఖండపు భూభాగాల్లోనే పెద్దమొత్తంలో, చౌకగా ఇంధన వనరులను ఉత్పత్తి చేయగల యూనిట్లను ఏర్పాటు చేసుకుంటామని ఆమె భరోసా వ్యక్తం చేశారు. ఈ ఏర్పాటు జరిగితే ఈయూ ఆర్థిక వికాసానికి ఆటంకాలు ఎదురుకావని స్పష్టం చేశారు.
అయితే ఈ దిశగా ఈయూ దేశాలన్నీ అత్యవసర భావనతో పనిచేయాల్సి ఉంటుందని ఆమె సూచించారు. ఇంధన రంగ సవాళ్లను అధిగమించి, సుస్థిర భవిష్యత్ నిర్మాణానికి కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉర్సులా వాన్ డెర్ లీయెన్ పేర్కొన్నారు.
‘‘రక్షణ రంగంలో ఈయూ గత కొన్ని దశాబ్దాల్లో సాధించలేనిది, గత సంవత్సరమే సాధించింది. ఈయూ సభ్యదేశాలు 2025 సంవత్సరంలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను రికార్డు స్థాయుల్లో పెంచాయి. ఐరోపా ఖండంలోని 3 దిగ్గజ రక్షణ రంగ టెక్ స్టార్టప్‌లు ఇప్పుడు యూనికార్న్‌ల స్థాయికి ఎదిగాయి. ఐరోపా దేశాల రక్షణ రంగం ఆవిష్కరణలకు, శక్తి సామర్థ్యాలకు ఇదే నిదర్శనం’’ అని ఉర్సులా వాన్ డెర్ లీయెన్ చెప్పారు.
కాగా, డిల్లీలో జనవరి 26న జరగనున్న 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉర్సులా వాన్ డెర్ లీయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా హాజరుకానున్నారు. జనవరి 27న జరగనున్న భారత్ – ఈయూ 16వ సదస్సులోనూ వారిద్దరూ పాల్గొంటారు.

More Stories
సింగరేణి టెండర్ల రద్దు కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం
కెనడా, వెనుజులా, గ్రీన్‌ల్యాండ్‌లతో సహా ట్రంప్ కొత్త మ్యాప్
స్టాక్‌మార్కెట్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి