వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 అనేది కేవలం మరో చట్టం కాదని, ఇది గ్రామ స్వరాజ్యానికి జీవం పోసే సంస్కరణ అని, అవినీతికి చెక్ పెట్టే వ్యవస్థ అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ప్రజాధనం ప్రజల చేతుల్లోకే చేరేలా చేసే బలమైన మార్గం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,700 గ్రామాలకు ఈ చట్టం ద్వారా వచ్చే మార్పు చేరాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నరేగా పథకం ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలలో ఒకటి కాగా, ఇప్పటివరకు ఈ పథకం మీద ఖర్చు చేసిన మొత్తం రూ. 11.53 లక్షల కోట్లు అని చెప్పారు. ఈ మొత్తం ఖర్చులో యూపీఏ ప్రభుత్వ కాలంలో పదేళ్లలో కేవలం రూ. 2.13 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 8.53 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు.ఈ  పథకంలో ఉన్న లోపాలు గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ  అనుభవంలోకి వచ్చిన విషయాలే అని స్పష్టం చేశారు.
ఫేక్ జాబ్ కార్డులు, ఫేక్ వర్కులు, లెక్కలకందని భారీ అవినీతి – ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో సాధారణంగా మారాయని ఆరోపించారు. పేదల కోసం వచ్చిందని చెప్పిన మన్రేగా పథకం మధ్యవర్తుల చేతుల్లో పడిందని, కాంట్రాక్టర్లకు లాభంగా మారిందని ధ్వజమెత్తారు.అయితే, 2014 తర్వాత సంస్కరణల దిశగా కీలక అడుగులు వేశారని, ఆధార్ సీడింగ్ ద్వారా ఒకే వ్యక్తికి పది జాబ్ కార్డులు అనే పరిస్థితికి చెక్ పెట్టారని,  నకిలీ లబ్ధిదారులను వ్యవస్థ నుంచి తొలగించారని నర్సయ్య గౌడ్ తెలిపారు. నేరుగా నగదు బదిలీ ద్వారా మధ్యవర్తులను తొలగించి, కూలీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేశారని, ఈ మార్పులతో వ్యవస్థలో పారదర్శకత వచ్చిందని, అవినీతికి బ్రేక్ పడిందని, బాధ్యత అనే భావన ఏర్పడిందని ఆయన వివరించారు.

 
దేశంలో 2.60 లక్షల గ్రామాలు ఉండగా, ఇప్పటి వరకు సగటున ప్రతి గ్రామానికి రూ 8 నుండి రూ 10 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. అయితే, ఏ గ్రామానికి వెళ్లినా ఈ డబ్బుతో నిర్మితమైన శాశ్వత పనులు కనిపిస్తున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.  ఈ డబ్బుతో గ్రామాల్లో ఉండాల్సింది బలమైన ప్రభుత్వ భవనాలు, పక్కా రోడ్లు, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, హరితహారం పేరుతో నిజమైన అడవుల నిర్మాణం అని ఆయన చెప్పారు. 
 
కానీ వాస్తవంగా జరిగినది ఏమిటంటే – గుంటలు తీయడం, మళ్లీ పూడ్చడం, కొన్ని మొక్కలు నాటడం, కొద్ది నెలల్లో వాటి ఆచూకీ కూడా లేకపోవడం అని విమర్శించారు. నరెగాలో అసలు సమస్య డబ్బు ఖర్చు చేయడం కాదని, ఆ డబ్బుతో ఏమి సృష్టించాం అన్నదే అని ఆయన చెప్పారు. వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 యొక్క ఆత్మ ఇదే అని స్పష్టం చేశారు.
 
ఈ చట్టం గ్రామాలకు నిజమైన స్వయం నిర్ణయాధికారాన్ని ఇస్తుందని, ప్రజాధనం ప్రజల పర్యవేక్షణలో ఖర్చయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తుందని బిజెపి నేత తెలిపారు. ఈ పథకంపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులకు ఆయన సవాల్ విసిరారు.