రాబోయే రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అలాగే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా గ్రోత్ రేటు ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని అభిప్రాయపడింది. సోమవారం విడుదల చేసిన తన తాజా ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో 2025-26 ఆర్థిక సంవత్సరంలోభారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
దీంతో వృద్ధి రేటును 7.3 శాతానికి పెంచింది. గతేడాది అక్టోబర్‌లో ఇచ్చిన అంచనా కంటే ఇది 0.7 శాతం ఎక్కువ. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 6.2 శాతం నుంచి 6.4 శాతానికి సవరించింది. 2027-28లో మాత్రం అనుకూలతలు తగ్గుముఖం పట్టడంతో వృద్ధి 6.4 శాతం వద్ద స్థిరపడవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా రాణించిందని, నాలుగో త్రైమాసికంలోనూ అదే జోరు కొనసాగడంతో ఐఎంఎఫ్ అంచనాలను సవరించింది.
ఇదిలా ఉండగా, 2025-26 ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో 8 శాతం, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 8.2 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు భారత గణాంక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఆహార ధరలు అదుపులోకి వస్తుండటంతో 2025 నాటికి ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యానికి అనుగుణంగానే ధరలు ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కూడా ఐఎంఎఫ్ కీలక అంచనాలను వెల్లడించింది. 2026లో 3.3 శాతంగా, 2027లో 3.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. చైనా వృద్ధి రేటును 5 శాతానికి సవరించింది. గతంలో కంటే 0.2 శాతాన్ని పెంచింది. అమెరికా టారిఫ్లో నేపథ్యంలో చైనా మార్కెట్ వేగంగా పుంజుకోవడంతో ఈ మేరకు ఐఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 2025లో 4.1 శాతం ఉంటే, 2027 నాటికి అది 3.4 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది.

More Stories
అమెరికా వస్తువులపై ఐరోపా ప్రతీకార సుంకాలు
త్రిపుర చిట్ ఫండ్ మోసం సూత్రధారి బెంగాల్ లో అరెస్ట్
విమానాల రద్దుకు ఇండిగోకు రూ. 22.20 కోట్ల జరిమానా