ఐరోపా దేశాలపై ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10 శాతం పన్ను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో దానికి ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 93 బిలియన్ పౌండ్ల (108 బిలియన్ డాలర్లు) విలువైన టారిఫ్‌లు విధించేందుకు ఇయు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. భారత కరెన్సీలో వాటి విలువ రూ.10 లక్షల కోట్లకు సమానం.
ప్రధానంగా బోయింగ్ విమానాలు, అమెరికా తయారీ కార్లు, బోర్బన్ (వైన్) వంటి పారిశ్రామిక వస్తువులను ఇయు లక్ష్యంగా చేసుకుంది. అమెరికాపై టారిఫ్‌లతో పాటు ఎదురుదాడి చర్యలను కూడా ఇయు పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే ముందుగా దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
డెన్మార్క్‌కు మద్దతుగా అమెరికాపై ప్రతీకార చర్యల కోసం ఈ వారం చివరలో మరోమారు బ్రస్సెల్స్‌లో ఇయు నేతలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఆదివారం ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో స్పందిస్తూ ఇయు కూటమిలోని దేశాలన్నీ డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా ఐక్యంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు తప్పని, యుఎస్ సుంకాలను చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించలేమని స్పష్టం చేశారు. తమ దేశం ఎవరి బ్లాక్ మెయిల్స్‌కు బయపడదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ బెదిరింపు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫ్రెంచ్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇయు తన అత్యంత శక్తివంతమైన వాణిజ్య ప్రతీకార సాధనం ‘యాంటీ-కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్’ను యాక్టివేట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది ఇయు దేశాలను ఎవరైనా బెదిరించిన లేదా బ్లాక్మెయిల్ చేసిన వాటిని అడ్డుకోవడానికి వీలుగా రూపొందించుకున్న ఒక ప్రత్యేక చట్టం. దీనితో ఒక విధంగా అమెరికాపై ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని మాక్రాన్ పరోక్షంగా హెచ్చరించారు.
ట్రంప్ చర్యలకు నిరసనగా అమెరికాతో జూలైలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఇయు నిర్ణయించింది. అయితే దీనికి యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంటుంది.

More Stories
భారత వృద్ధి రేటు అంచనా 7.3 శాతంకు పెంచిన ఐఎంఎఫ్
త్రిపుర చిట్ ఫండ్ మోసం సూత్రధారి బెంగాల్ లో అరెస్ట్
విమానాల రద్దుకు ఇండిగోకు రూ. 22.20 కోట్ల జరిమానా