భారత్‌లో ఆడకుంటే బంగ్లాదేశ్‌పై వేటు తప్పదు

భారత్‌లో ఆడకుంటే  బంగ్లాదేశ్‌పై వేటు తప్పదు
భారత్‌లోనే ప్రపంచకప్‌ ఆడాలని బంగ్లాకు స్పష్టం చేసింది. అందుకు అంగీకరించకుంటే, ఏకంగా టోర్నీ నుంచే తప్పిస్తామని ఆ దేశ బోర్డును ఐసీసీ హెచ్చరించింది. మంకుపట్టు వదిలేసి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు భారత్‌లో ఆడుతారా? టోర్నీ నుంచి తొలగించమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి. 
జనవరి 21 వరకూ మీ నిర్ణయాన్ని తెలియజేయాలని బంగ్లా బోర్డుకు స్పష్టం చేసింది ఐసీసీ.
 
భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ప్రపంచకప్ ఆడకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బిసిబి) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బెడిసి కొడుతున్నాయి. ఒక్కొక్కటిగా బంగ్లా బోర్డుకు అన్ని దారులు మూసుకుపోతున్నాయి. గ్రూప్ స్వాపింగ్‌ చేయాలని ఐసీసీకి విన్నవించుకున్నా నిరాశే ఎదురైంది.  ఎందుకంటే తమను గ్రూప్ బీలోకి మార్చాలని అభ్యర్థించిన బంగ్లాదేశ్‌ ఆశలపై క్రికెట్ ఐర్లాండ్ నీళ్లు చల్లింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ మారబోమని, శ్రీలంకలోనే తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఆదివారం ఐర్లాండ్ స్పష్టం చేసింది.
శనివారం ఐసీసీ ప్రతినిధులు ఢాకాలో బంగ్లాదేశ్ బోర్డు సభ్యులతో సమావేశమైన సందర్భంగా భారత్‌లో ఆడకూడదనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ బృందం నచ్చజెప్పాలని చూసింది. కానీ, బంగ్లా బోర్డు మెంబర్స్ మాత్రం అందుకు అంగీకరించలేదు. శ్రీలంకలో ఆడేందుకు వీలు కల్పించేలా తమ జట్టును గ్రూప్ సీ నుంచి గ్రూప్ బీలోకి మార్చాలని ఐసీసీ సభ్యలను వారు కోరారు. 
 
పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం గ్రూప్ ‘సీ’లో ఉన్న బంగ్లాదేశ్ లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. నాలుగో మ్యాచ్‌ ముంబైలో ఉంది. ఇక గ్రూప్ ‘బీ’లోని ఐర్లాండ్ కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. మెగాటోర్నీకి చాలా తక్కువ సమయమున్న నేపథ్యంలో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్ భారత్‌, శ్రీలంక వేదికలుగా జరగనుంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్‌ తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో వేదికల మార్పు అసాధ్యమని ఐసీసీ చెబుతూ వస్తోంది. అయినా బీసీబీ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో బీసీబీకి ఐసీసీ జనవరి 21ని డెడ్‌లైన్‌గా విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

 
గత వారంలో రెండుసార్లు ఐసీసీ, బీసీబీ మధ్య చర్చలు జరిగాయి. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదని ఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా భారత్‌కు రావడానికి బీసీబీ ఒప్పుకోకపోతే, బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ టీమ్‌ బంగ్లాదేశ్ అవకాశాన్ని దక్కించుకుంటుంది.

.