తాను ముస్లిం కావడం వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, మారిన అధికార సమీకరణాలు కూడా అందుకు ఓ కారణం కావొచ్చు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రముఖులతో సహా అందరూ ఖండిస్తున్నారు.
తాజాగా సంచలన రచయిత తస్లీమా నస్రీన్ కూడా స్పందిస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టులో ఏఆర్ రెహ్మాన్ మనోవేదనను తప్పుపట్టారు. రెహ్మాన్ ముస్లిం వ్యక్తే అని, భారత్‌లో ఆయన ఓ ప్రముఖ వ్యక్తి అని, ఇతర కళాకారులకన్నా ఆయన సంపాదన ఎక్కువే అని ఆమె పేర్కొన్నారు. బహుశా సంపన్న సంగీత దర్శకుడు అయి ఉంటారని, కానీ ముస్లిం కావడం వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదని రెహ్మాన్ ఫిర్యాదు చేస్తున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో షారూక్ బాద్‌షా అని, సల్మాన్, ఆమిర్, జావిద్ అక్తర్, షబానా అజ్మీ అందరూ సూపర్ స్టార్లే అని ఆమె గుర్తు చేశారు. సంపన్నులు, ఫేమస్ వ్యక్తులకు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉండవని ఆమె స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, వర్గం ఏదైనా సమస్య ఉండదని తస్లీమా చెప్పారు. కానీ తనవంటి పేదలకు సమస్యలు ఉంటాయని చెబుతూతాను హేతువాదినని, ఎక్కడకు వెళ్లినా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
ఇలాంటి సమస్యలు బాలీవుడ్‌లో ముస్లిం స్టార్లకు రావని ఆమె స్పష్టం చేశారు. ఇస్లాంను వ్యతిరేకించినందుకు తాను బహిష్కృత జీవితాన్ని గడుపుతున్నట్లు ఆమె తెలిపారు. కానీ ఏఆర్ రెహ్మాన్‌ను హిందువులు, ముస్లింలు, బౌద్దులు, క్రైస్తవులు, హేతువాదులు విశ్వసిస్తారని, ఆయన మీద జాలిపడే సందర్భం కాదు అన్నట్లు తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు.

More Stories
ముంబై మేయర్ కోసం పట్టుబడుతున్న షిండే
సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత
బంగ్లా ఎన్నికల్లో హసీనా పార్టీని చేర్చకపోతే స్థిరత్వం అసాధ్యం