టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో భక్తి, సంస్కృతిని పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించే విధంగా ఈ ఆలయాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటి వరకు 1,176 అర్జీలు రాగా దాదాపు 463 ఆలయాలను నిర్మించేందుకు పరిపాలన అనుమతులను ఇచ్చారు. మిగిలినవి ఇంకా పరిశీలన దశలో ఉన్నాయి. ఆయా గ్రామాలు, కాలనీల్లో అందుబాటులో ఉన్నటువంటి స్థలానికి అనుగుణంగా ఆలయ నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తున్నారు. ఉదాహరణకు 5 సెంట్ల స్థలం అయితే రూ.10 లక్షలు, 8 సెంట్లకు రూ.15 లక్షలు, 10 సెంట్లు, అంతకంటే ఎక్కువ స్థలమైతే రూ.20 లక్షలతో ఆలయాన్ని నిర్మించనున్నారు.
ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండేలా చూడాలనీ, ఇందుకు అవసరమైతే అదనంగా నిధులను సైతం వెచ్చించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఇటీవల ఆదేశించారు. దీంతో వీటి కోసం అదనంగా మరో రూ.5-10 లక్షల వరకు వెచ్చించనున్నారు. అంటే ఒక్కో ఆలయానికి కనీసం రూ.15 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.
గతంలో 2,000 ఆలయాలను మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకే వెచ్చించారు. ఇందులో 1,400 పూర్తి కాగా, మరో 600 ఆలయాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. వీటి కంటే మరింత పెద్దగా ఇప్పుడు 5,000 ఆలయాలను నిర్మించనున్నారు. ఆలయానికి అవసరమైన స్థలాన్ని గ్రామంలోని ప్రైవేటు వ్యక్తులు దానంగానైనా ఇవ్వొచ్చు. పంచాయితీ స్థలంలో నిర్మించాలనుకుంటే తీర్మానం అవసరం ఉంటుంది. రెవెన్యూ స్థలమైతే ఆ శాఖ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
ఆలయాన్ని నిర్మించుకునేందుకు కాలనీ, గ్రామంలోని కమిటీగా ఏర్పడి ముందుకొస్తే, వారికే నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. శిర్డీ సాయిబాబా ఆలయాలు మినహా, మరే ఇతర స్వామి, అమ్మవార్ల ఆలయాలు అయినా నిధులను మంజూరు చేస్తున్నారు. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరిపోతుంది. లేకపోతే విగ్రహానికి కూడా కలిపి నిధులను మంజూరు చేస్తున్నారు.

More Stories
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం
మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం