గత ఐదేళ్లలో కాలంలో యూనివర్సిటీలు, కళాశాలల్లో కులవివక్షకు సంబంధించిన ఫిర్యాదులు 118.4 శాతం పెరిగాయి. పార్లమెంటరీ కమిటీకి, సుప్రీంకోర్టుకు సమర్పించిన సమాచారంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఈ విషయాన్ని తెలియజేసింది. కులవివక్షకు సంబంధించి 2019-20లో 173 ఘటనలు నమోదు కాగా, 2023-24లో ఆ సంఖ్య 378కి పెరిగింది.
704 యూనివర్సిటీలు, 1,553 కళాశాలలకు సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీస్ సెల్స్ (ఇఒసిలు), ఎస్‌సి, ఎస్‌టి సెల్స్ నుంచి 2019-20, 2023-24 మధ్యకాలంలో యుజిసికి 1,160 ఫిర్యాదులు అందాయి. వీటిలో 1,052 ఫిర్యాదులను (90.68 శాతం) పరిష్కరించారు. ఇదే కాలంలో పెండింగ్ కేసుల సంఖ్య 18 నుంచి 108కి పెరిగింది.
విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంవత్సరాల వారీగా యుజిసి అందజేసిన డేటాను పరిశీలిస్తే కులవివక్ష కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2020-21లో 182, 2021-22లో 186, 2022-23లో 241 కేసులు నమోదయ్యాయి. 2023-24లో అవి మరింతగా పెరిగి 378కి చేరుకున్నాయి.
ఎస్‌సి, ఎస్‌టి, ఈక్వల్ ఆపర్చునిటీస్ సెల్స్ పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన పెరగడంతో ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని యుజిసి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ విభాగాలు కేసులను క్రియాశీలకంగా పరిష్కరిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, చాలా ఎస్‌సి, ఎస్‌టి సెల్స్ పరిపాలనా యంత్రాంగం నియంత్రణలో పనిచేస్తున్నాయనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. వాటి సభ్యులు పరిపాలనా యంత్రాంగం చేత నామినేట్ చేస్తుండడంతో వాటి స్వయంప్రతిపత్తి కాలక్రమేణా క్షీణించిందని విమర్శలు వస్తున్నాయి.
గత సంవత్సరం సుప్రీంకోర్టుకు యుజిసి సమర్పించిన ముసాయిదా ఈక్విటీ నియంత్రణలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యుజిసి గత వారం ముసాయిదా నియంత్రణలను నోటిఫై చేసింది. విమర్శకులు లేవనెత్తిన కొన్ని అంశాలకు వాటిలో పరిష్కారాలు చూపింది. ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ ఆపర్చునిటీస్ సెంటర్లు, 24/7 హెల్ప్‌లైన్లు, ఇతర ఆన్‌లైన్ ఫిర్యాదుల యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది.
గత సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యుజిసి ఈ డేటాను సమర్పించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో యుజిసి అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలోని 3,522 ఉన్నత విద్యా సంస్థల నుంచి స్పందన లభించిందని అందులో తెలిపింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ సెల్స్, ఎస్‌సి – ఎస్‌టి సెల్స్ నుంచి 1,503 ఫిర్యాదులు అందగా 1,426 ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొంది.

More Stories
ఇరాన్ నుండి భారత్‌కు చేరుకున్న భారతీయులు
వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్
హెచ్ఐవీ వైరస్‌ను మూలంగా తొలగించే చైనా ప్రయత్నం