ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశానికి “ది సిటీ ఆఫ్ డెస్టినీ”గా పిలుచుకునే విశాఖ నగరం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో దీనిని విశ్వనగర కేంద్రంగా మార్చడానికి అనేక కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇటీవల, నగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పచ్చజెండా ఊపారు.
తాజాగా విశాఖలో కేంద్ర ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో విమానాశ్రయం, పోర్టులు ఉండటంతో దేశవిదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులు గతంలో కన్నా చాలా బాగా పెరిగాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇవి మరింత ఊపందుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇమిగ్రేషన్ సేవలకు విశాఖలో ప్రత్యేక కార్యాలయం అవసరం కానుంది. దీంతో కేంద్ర హోంశాఖ విశాఖ నగరం మారికవలస సమీపంలోని వీఎంఆర్డీఏకు చెందిన ఓజోన్ వ్యాలీ లేఅవుట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ కార్యాలయానికి కావలసిన స్థలం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (బీవోఐ) పనిచేస్తుంది. ఈ ప్రభుత్వ సంస్థని 1971లో స్థాపించారు. దేశవ్యాప్తంగా సుమారు 108 ఇమిగ్రేషన్ కార్యాలయాలు ఉండగా వాటిలో 48 కార్యాలయాలను బీవోఐ నిర్వహిస్తుంది. మిగిలిన కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయి.
విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లోని ఇమిగ్రేషన్ వ్యవహారాలన్నీ బీవోఐ(బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్) పరిధిలోకి వస్తాయి. విదేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల వ్యవహారాలను బీవోఐ పరిశీలిస్తుంది. సిబ్బంది కొరతతో ప్రస్తుతం తనిఖీలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. ఒక్కోసారి బీవోఐ రాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ బీవోఐని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) కాంప్లెక్స్ ఇమిగ్రేషన్ తనిఖీల్లో ఎంతో కీలకం. త్వరలో దీన్ని కొనుగోలు చేసిన స్థలంలోనే నిర్మించనున్నారు. ఈ కాంప్లెక్స్ ఇమిగ్రేషన్‌కు ఒక చెక్‌పోస్టు లాంటిది. అందులో విదేశీయులకు సంబంధించిన దస్త్రాలను సాంకేతికంగా విశ్లేషిస్తారు. అవసరమైన సమాచారాన్నంతా భద్రపరుస్తారు.

More Stories
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు
మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం