బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది

బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన సమయం వచ్చింది
బెంగాల్ ప్రజలు నిజమైన మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. టీఎంసీ అవినీతి, హింసతో నిండిన పార్టీ అని చెబుతూ బిహార్‌లో ఎన్ డీఏ విజయం సాధించిందని, ఇప్పుడు బంగాల్ సమయం వచ్చిందని స్పష్టం చేశారు.  శనివారం బంగాల్‌లోని మాల్దాలో పర్యటించిన ప్రధాని మోదీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 
బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,  అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ ప్రభుత్వం కొలువుదీరాల్సిన అవసరం ఉందని చెప్పారు.  దేశ ప్రజలు ముఖ్యంగా జెన్‌-జీ కూడా బీజేపీ అభివృద్ధి నమూనాను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్పారు. మాల్దా సభలో ప్రసంగించిన ఆయన.. బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిందని, ఇక బెంగాల్‌కు సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు అసలైన సవాల్‌ చొరబాట్లేనని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

బెంగాల్‌కు అతిపెద్ద సవాల్‌ చొరబాట్లేనని, వీటి కారణంగానే మాల్దా, ముర్షీదాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని చెప్పారు. చొరబాట్ల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందని చెబుతూ వీటిని అరికట్టడానికి టీఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. పైగా చొరబాటుదారులను ఓటర్లుగా మారుస్తోందని విమర్శించారు.

రాష్ట్రానికి వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు చేరలేదని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్రవాటాగా దక్కే కేంద్ర నిధులను తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొల్లగొడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని చెబుతూ  బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

“మమతా బెనర్జీ సర్కారు బంగాల్ ప్రజలను కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ నుంచి లబ్ధి పొందకుండా అడ్డుకుంటోంది. ఆ పథకంతో దేశంలోని అల్ప ఆదాయ వర్గాల ప్రజలంతా ఉచితంగా ఆరోగ్య బీమా కవరేజీని పొందొచ్చు. మనసులేని, కర్కశమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహాయం బంగాల్ ప్రజలకు చేరకుండా అడ్డుపడుతోంది” అని ప్రధాని ధ్వజమెత్తారు. 

“బంగాల్‌లోని పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలి. ఉచిత రేషన్ అందాలి. సంక్షేమ పథకాల ప్రయోజనాలన్నీ లభించాలి. ఇందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడాలి. తప్పకుండా బంగాలీలు మార్పును కోరుకుంటారని నేను నమ్ముతున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు. విభజన రాజకీయాలు చేసే వాళ్లే దశాబ్దాల పాటు తూర్పు భారత రాష్ట్రాలను పరిపాలించారని, వాటికి విద్వేష, విభజన రాజకీయాల సంకెళ్ల నుంచి బీజేపీయే విముక్తి కల్పించిందని ప్రధాని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాల సుపరిపాలనను పొందుతున్న రాష్ట్రాలు ఇప్పుడు బంగాల్ చుట్టూ ఉన్నాయని గుర్తు చేశారు. 

 
“తొలిసారిగా ఒడిశాలోనూ బీజేపీ సర్కారు ఏర్పడింది. చాలా ఏళ్లుగా బీజేపీని త్రిపుర విశ్వసిస్తోంది. అసోంలో ఇటీవలే జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ రాణించింది. అక్కడి ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచారు. బిహార్ సైతం ఎన్‌డీఏ పాలననే కోరుకున్నారు. మా కూటమినే ఆశీర్వదించారు. తదుపరిగా బంగాల్‌లోనూ బీజేపీ సుపరిపాలన అందాల్సి ఉంది” అని ప్రధాని తెలిపారు.