ముంబై మేయర్ పదవికోసం శివసేన జగడం!

ముంబై మేయర్ పదవికోసం శివసేన జగడం!
227 మంది సభ్యులున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మహా యుతి సాధించిన విజయం చారిత్రాత్మకమైనది, ఎందుకంటే ఇది థాకరేల చివరి కంచుకోటలో వారి గుత్తాధిపత్యాన్ని అంతం చేసింది. అయితే, ముంబై కొత్త మేయర్ ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ),ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ విషయంపై ఇంకా చర్చలు జరపలేదని శనివారం ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి.
 
తన పార్టీ బీఎంసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ముంబైలో మేయర్‌ను నియమించడం తన కల అని ఉద్ధవ్ థాకరే పేర్కొంటూ దేవుడి దయ ఉంటే ఈ కల నెరవేరుతుందని చెప్పడంతో రాజకీయ కలకలం చెలరేగుతుంది. మేయర్ పదవి విషయంలో ఉద్ధవ్ వెనక్కి తగ్గకపోవడంతో, షిండే సేన తన 29 మంది కార్పొరేటర్లను ముంబైలోని బాంద్రాలో ఉన్న తాజ్ ల్యాండ్స్ ఎండ్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించింది. 
 
వారు అక్కడ ఎంతకాలం ఉంటారనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికల హడావిడి తర్వాత వారిని ‘ఉత్తేజపరిచేందుకు’ కార్పొరేటర్లను అక్కడికి తరలించినట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. అయితే, మొదటిసారి ముంబై మేయర్ పదవి చేపట్టాలని ఉత్సాహంగా ఉన్న బిజెపి ఆశలకు బ్రేక్ చేస్తూ రొటేషన్ పద్ధతిపై మేయర్ పదవి తమకు కూడా అప్పగించాలని షిండే సేన కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది.

బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, దానికి సొంతంగా మెజారిటీ లభించలేదు. శనివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి షిండే హాజరు కాకపోవడంతో మేయర్ పదవికోసం బేరసారాలు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుంది.  గతంలో, ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తన అసంతృప్తిని సూక్ష్మంగా తెలియజేయడానికి షిండే కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం పరిపాటిగా మారింది.  

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో 227 వార్డులకు గాను అధికారం కోసం 114 సీట్ల బలం అవసరం. అధికార మహాయుతి కూటిమికి చెందిన బీజేపీ 89 సీట్లు, షిండే వర్గం శివసేన 29 సీట్లు గెలుచుకున్నాయి. అధికారానికి అవసరమైన 114 సభ్యుల కంటే ఈ రెండు పార్టీలకు 118 మంది సభ్యులున్నారు. మహాయుతి కూటమికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ బీఎంసీలో మూడు వార్డులు గెలిచింది.

కాగా, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 వార్డుల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా నిర్మాణ సేన (ఎంఎస్‌ఎన్‌) 6 వార్డులు గెలుచుకున్నది. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఒక వార్డు దక్కించుకున్నది. కాంగ్రెస్ 24 వార్డుల్లో, ఏఐఎంఐఎం ఎనిమిది వార్డుల్లో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు వార్డుల్లో విజయం సాధించాయి. దీంతో ప్రతిపక్షాల బలం 106కు చేరుకున్నది. మెజారిటీ మార్కు అయిన 114కు కేవలం 8 మాత్రమే తక్కువ.

కాగా, ఏకీకృత శివసేన బీఎంసీలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నది. తాజా ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే మేయర్‌ పదవి శివసేనకే దక్కాలని షిండేపై ఒత్తిడి పెరుగుతున్నది. అదే సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో మేయర్‌ ఎన్నికలో కింగ్‌మేకర్‌ అయిన షిండే రిసార్ట్‌ రాజకీయాలు తెరతీశారు. గెలిచిన పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తరలించారు.

ఈ అంతర్గత పోరు మధ్య, ఫడ్నవీస్ మాట్లాడుతూ, “ముంబై మేయర్ మహాయుతి నుంచే ఉంటారు. మేయర్ హిందువు, మరాఠీ వారై ఉంటారు” అని స్పష్టం చేశారు. మేయర్ పదవి ఎవరికి దక్కాలనే దానిపై కూటమిలో విభేదాలు ఉన్నాయనే వార్తలను తోసిపుచ్చుతూ, ఆయన, “మేము అందరం కలిసి కూర్చుని అన్ని నిర్ణయాలను స్నేహపూర్వకంగా తీసుకుంటాము” అని తేల్చి చెప్పారు. 

మేయర్ ఎవరు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనే ఈ ప్రశ్నలన్నింటినీ తాను,  షిండే కలిసి నిర్ణయిస్తామని, ఎలాంటి వివాదం లేదని వెల్లడించారు. షిండే తన పార్టీకి చెందిన ఎన్నికైన సభ్యులను రాబోయే కొన్ని రోజుల పాటు ఒక హోటల్‌కు తరలించడంపై ఫడ్నవీస్ మాట్లాడుతూ, “కొత్తగా ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి మాట్లాడటానికి షిండే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చు” అని పేర్కొన్నారు.

బీజేపీ కూడా తన కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఒక సమావేశం నిర్వహించిందని ఆయన చెప్పారు. మరోవంక, జనవరి 17 నుండి 24 వరకు ఫడ్నవీస్ దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి వెవెడుతున్నారు. దానితో మరో పది రోజుల వరకు మేయర్ విషయం తేలే అవకాశం లేదని భావిస్తున్నారు.